Godavarikhani: గోదావరిఖనిలో ఇద్దరి నేత్రాలతో నలుగురి జీవితాల్లో వెలుగులు

Godavarikhani: గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన వాలా లక్ష్మి, మిడిదొడ్డి రాములు కుటుంబాలు నేత్రదానానికి అంగీకరించడంతో సదాశయ ఫౌండేషన్ నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది.

VIJAY, RAMAGUNDAM
Published on: 6 Nov 2026 6:53 PM IST
Godavarikhani
X

Godavarikhani: గోదావరిఖనిలో ఇద్దరి నేత్రాలతో నలుగురి జీవితాల్లో వెలుగులు

Godavarikhani: ఆప్తులను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబాలు గొప్ప మనసు చాటుకున్నాయి. తమ వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినా.. వారి కళ్లతో మరో ఇద్దరు ఈ లోకాన్ని చూడాలనే మానవీయ ఆలోచనతో నేత్రదానానికి ముందుకొచ్చాయి. ఇద్దరు వృద్ధుల నేత్రదానంతో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాయి.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన వాలా లక్ష్మి (82) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేస్తే మరో ఇద్దరికి చూపు వస్తుందని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి, రామగుండం మగువ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షురాలు అట్లూరి శశికళ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో కుమారులు, కోడళ్లు సత్యనారాయణరావు-ఉమారాణి, ప్రసాదరావు-అరుణ, రమేష్‌రావు-లలిత నేత్రదానానికి అంగీకరించారు.

అదే కాలనీకి చెందిన సింగరేణి విశ్రాంత కార్మికుడు మిడిదొడ్డి రాములు (81) కూడా శుక్రవారం మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు శశికళ నేత్రదానంపై అవగాహన కల్పించడంతో భార్య వరలక్ష్మి, కుమారుడు ఈశ్వర్, కోడలు శోభారాణి, కోడలు మాధవీలత, కుమార్తె శ్రీదేవి, మనవళ్లు, మనవరాళ్లు యశ్వంత్, స్వాతి, విష్ణువర్ధిని, నవ్యశ్రీ నేత్రదానానికి సమ్మతి తెలిపారు.

రెండు కుటుంబాల అంగీకారంతో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు ఆరపెల్లి రాజమౌళి, కే.ఎస్.వాసు, అట్లూరి శశికళ ఆధ్వర్యంలో వాసన్ ఐ బ్యాంక్ సాంకేతిక నిపుణుడు చందు నేత్రాలను సేకరించారు. అనంతరం వాటిని హైదరాబాద్‌కు తరలించారు.

కుటుంబ సభ్యుల గొప్ప మనసుకు అభినందనలు

తమ ఆప్తులను కోల్పోయిన బాధలోనూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో నేత్రదానానికి ముందుకొచ్చిన రెండు కుటుంబాలను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి అభినందించారు. ఫౌండేషన్ ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేష్, లగిశెట్టి చంద్రమౌళి, భీష్మాచారి, వెల్దీ కవిత, అనంతరాములు, కే.ఎస్.వాసు, ఆరపెల్లి రాజమౌళి, రాంరెడ్డి, శంకర్‌రావు, లక్ష్మీనారాయణ, రామన్న, ధీటి వెంకటస్వామి, అట్లూరి శశికళ, జ్యోతి, అన్నపూర్ణ, గోలివాడ చంద్రకళ తదితరులు కుటుంబ సభ్యులను అభినందించారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM