Karimnagar: ఉద్యోగులకు 'ఈహెచ్‌ఎస్' వరప్రదాయిని..జేఏసీ ఆసుపత్రుల తనిఖీ!

Karimnagar: కరీంనగర్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆసుపత్రుల సందర్శన. EHS ద్వారా అందుతున్న వైద్య సేవలపై ఉద్యోగుల సంతృప్తి. సోషల్ మీడియా దుష్ప్రచారం ఖండన.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 3 Oct 2026 5:41 PM IST
Karimnagar
X

Karimnagar: ఉద్యోగులకు 'ఈహెచ్‌ఎస్' వరప్రదాయిని..జేఏసీ ఆసుపత్రుల తనిఖీ!

Karimnagar: తెలంగాణ ఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో, జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పర్యవేక్షణలో కరీంనగర్ టౌన్‌లోని పలు ఆసుపత్రులను సందర్శించారు.

ఈ సందర్భంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలు తీరు, ఉద్యోగులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్స సమయంలో ఎదురవుతున్న సమస్యలను ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించారు. సన్‌రైజ్ హాస్పిటల్‌లో నిర్వహించిన ‘Meet & Greet’ కార్యక్రమంలో మారం జగదీశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం ఉద్యోగులకు EHS ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని, ఉద్యోగులకు నాణ్యమైన చికిత్స అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.

అదేవిధంగా సన్‌రైజ్ హాస్పిటల్‌ను EHS పరిధిలోకి చేర్చే అంశంపై కూడా చర్చించగా, ఉద్యోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.

అపోలో రీచ్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్, స్టార్ హాస్పిటల్‌లను కూడా సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న ఉద్యోగులు, పేషెంట్లను కలిసి EHS ద్వారా అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు EHS ఉద్యోగులకు వరప్రదాయిని వంటిదని, ఈ పథకం ద్వారా మంచి వైద్య సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా హృదయ సంబంధిత చికిత్సలు, మోకాళ్ల మార్పిడి (Knee Replacement) వంటి శస్త్రచికిత్సలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పేషెంట్లు తెలిపారు.

EHS నిబంధనల ప్రకారం ఉద్యోగులకు వైద్య సేవలు అందించే సమయంలో ఉద్యోగుల నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా వైద్య సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యాలు స్పష్టం చేశాయి.

ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా EHS సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. EHS కు సంబంధించిన ఏ సమస్య ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే, సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

వాట్సాప్ మరియు సోషల్ మీడియాలో EHS, ఉద్యోగుల వైద్య సేవలు, ఎంప్లాయీస్ జేఏసీపై వస్తున్న దుష్ప్రచారాన్ని మారం జగదీశ్వర్ తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో వస్తున్న నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మకుండా ఉద్యోగులు ఎంప్లాయీస్ జేఏసీపై విశ్వాసం ఉంచాలని కోరారు. EHS ద్వారా వాస్తవంగా అందుతున్న వైద్య సేవలను తెలుసుకునేందుకు ఉద్యోగులు స్వయంగా సంబంధిత ఆసుపత్రులను సందర్శించి, అక్కడి సేవలను పరిశీలించాలని సూచించారు.

ఉద్యోగులకు ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని ఆధారంగా చేసుకోకుండా నేరుగా ఎంప్లాయీస్ జేఏసీ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా జేఏసీ నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు.ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రుల యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని మారం జగదీశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మరియు మంత్రి మండలి సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వైద్యులు దేవుళ్లతో సమానం .... దారం శ్రీనివాస్ రెడ్డి, మాడిపెల్లి కాళీచరణ్ గౌడ్ ఈ సందర్భంగా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మాడిపెల్లి కాళీచరణ్ గౌడ్ మాట్లాడుతూ “వైద్యో నారాయణో హరి” అనే భావనను గుర్తు చేస్తూ వైద్యుల సేవలను ప్రశంసించారు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే, ఆపద సమయంలో వైద్యులు పునర్జన్మను ప్రసాదించే వారిగా నిలుస్తారని వారు పేర్కొన్నారు.

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తికి వైద్యులు ప్రాణదాతలుగా నిలుస్తారని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, సమాజానికి సేవలందించే ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవలు అందించడం ఎంతో గొప్ప విషయమని వారు పేర్కొన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలకు, వైద్యులకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

“దేవుడు మీకు ఇచ్చిన ఈ పవిత్రమైన వైద్య వృత్తి ద్వారా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఉద్యోగులకు మరింత ఆప్యాయతతో, మానవతా దృక్పథంతో వైద్యం అందించాలి. ధనార్జన ఒక్కటే లక్ష్యంగా కాకుండా సేవా భావంతో వైద్య సేవలు అందించాలని” వారు ఆసుపత్రుల యాజమాన్యాలను కోరారు.

EHS ద్వారా ఉద్యోగులకు అందుతున్న వైద్య సేవలు మరింత మెరుగుపడేందుకు ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు, ఉద్యోగ సంఘాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మాడిపెల్లి కాళీచరణ్ గౌడ్, DMHO రాజ్ గోపాల్ రావు, EHS జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజు, మేనేజర్ విజయ్, సన్‌రైజ్ హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ సురేష్, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ చాందిని, డాక్టర్ వెంకటరెడ్డి, అపోలో రీచ్ హాస్పిటల్ ప్రతినిధి సతీష్, మెడికవర్ హాస్పిటల్ ప్రతినిధి కిరణ్,

టీఎన్జీవోల సంఘం నాయకులు నాగేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సర్దార్ హర్మేందర్ సింగ్, రాగి శ్రీనివాస్, ఆకుల సతీష్, మారుపాక రాజేష్ భరద్వాజ్, రమేష్ గౌడ్, వెలిచాల సుమంత్ రావు, అస్గర్ అలీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN