Manthani: మంథనిలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న దుద్దిళ్ల కుటుంబం: పుట్ట మధు!
Manthani: మంథని సంగీత, నృత్య పాఠశాల శిలాఫలకం వివాదంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ శుక్రవారం స్పందిస్తూ మంత్రి శ్రీధర్ బాబు కుటుంబంపై విమర్శలు చేశారు.
Manthani: మంథనిలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న దుద్దిళ్ల కుటుంబం: పుట్ట మధు!
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో రెండు రోజుల క్రితం ప్రారంభమైన సంగీత, నృత్య పాఠశాల భవనం శిలాఫలకం వివాదం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సంగీత, నృత్య పాఠశాల భవనాన్ని సందర్శించి శిలాఫలకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
80 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలోనూ మంథనిలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని దుద్దిళ్ల కుటుంబంపై పుట్ట మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రాజ్యాంగ పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ, రాజ్యాంగ పుస్తకాన్ని గుండెకు హత్తుకొని తిరుగుతున్న ప్రియాంక గాంధీ.. మంథనిలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫిర్యాదు చేసిన తర్వాత రాత్రికి రాత్రే మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఊరికి దూరంగా ఉంచినట్లుగా శిలాఫలకాన్ని సైతం చీకటి గదిలో ఏర్పాటు చేశారని విమర్శించారు. బయట ఒక శిలాఫలకం, చీకటి గదిలో మరో శిలాఫలకం ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
శిలాఫలకంపై బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పాటు మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ పేర్లు ఎందుకు లేవని ప్రశ్నించారు. కేవలం మంత్రి శ్రీధర్ బాబు పేరు మాత్రమే ఉన్న శిలాఫలకాన్ని ముందు పెట్టి, మిగతా ప్రజాప్రతినిధుల పేర్లతో మరో శిలాఫలకాన్ని చీకటి గదిలో ఏర్పాటు చేయడం ప్రోటోకాల్‌కు విరుద్ధమని అన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడు తన పేరు, ముఖ్యమంత్రి పేరు శిలాఫలకంపై పెట్టాలని కోరుకునే పరిస్థితి మంథనిలో రావడం దురదృష్టకరమన్నారు.
ముందు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించి, చీకటి గదిలో ఉన్న శిలాఫలకాన్ని ముందుభాగంలో ఏర్పాటు చేయాలని అధికారులను పుట్ట మధు డిమాండ్ చేశారు. మంథని నియోజకవర్గంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్నది ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి నిర్మించిన మహిళా భవనాన్ని ఇప్పుడు సంగీత, నృత్య పాఠశాలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు.




