Peddapalli: పెద్దపల్లిలో శనివారం మెగా జాబ్ మేళా: డా. దాసరి మమతా రెడ్డి!
Peddapalli: పెద్దపల్లి ప్రగతి నగర్ ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో నవంబర్ 21న 2,000కు పైగా ఉద్యోగాలతో జరిగే మెగా జాబ్ మేళా పోస్టర్ను డా. దాసరి మమతా రెడ్డి ఆవిష్కరించారు.
Peddapalli: పెద్దపల్లిలో శనివారం మెగా జాబ్ మేళా: డా. దాసరి మమతా రెడ్డి!
పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే గొప్ప సంకల్పంతో మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో, ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి ఆలోచన మేరకు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం ట్రినిటీ విద్యాసంస్థల కళాశాల సిబ్బందితో కలిసి మెగా జాబ్ మేళా పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ దాసరి మమతా రెడ్డి మాట్లాడుతూ, ట్రినిటీ విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నాయని తెలిపారు. విద్యను అందించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా దాదాపు 20కు పైగా మల్టీనేషనల్ కంపెనీలను మన ప్రాంత యువత ముంగిటకే తీసుకువచ్చి 2000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు.
గతంలో దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాదాపు 3 వేల మంది యువతకు వివిధ రకాల శిక్షణ, కోచింగ్ ఇప్పించి ఆర్మీతో పాటు ఇతర రక్షణ దళాల్లో ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదే సేవా సంకల్పంతో నేడు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు.
ఉద్యోగం అంటే కేవలం ఒక వ్యక్తికి ఉపాధి మాత్రమే కాదు.. ఒక కుటుంబానికి భరోసా. ఆ భరోసాను కల్పించాలనే సంకల్పంతోనే ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి ఎదురుచూసే పరిస్థితి లేకుండా మన ఇంటి ముంగిటకే కంపెనీలను తీసుకురావడం గొప్ప అవకాశమని, యువత ఈ సువర్ణావకాశాన్ని వదులుకోవద్దని అన్నారు.
ఇంతటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి, ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
యువత తమ భవిష్యత్తు కోసం ఒక్క ముందడుగు వేస్తే.. వారికి అండగా నిలిచేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.. మీరు తప్పకుండా విజయం సాధిస్తారని నిరుద్యోగ యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలిపారు.
నవంబర్ 21వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి పెద్దపల్లి ప్రగతి నగర్లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే ఈ మెగా జాబ్ మేళాకు అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులందరూ తమ బయోడేటాతో పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ట్రినిటీ విద్యాసంస్థల అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.




