Sircilla: మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు..సైకాలజిస్ట్ పున్నంచందర్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మనోవికాస సదస్సు నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 5 Nov 2026 1:18 PM IST
Sircilla
X

Sircilla: మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు..సైకాలజిస్ట్ పున్నంచందర్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని స్థానిక పద్మశాలి సంఘం భవనంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో మనోవికాస సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్ల పాల్గొని మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రతి ఒక్కరూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన కౌన్సెలింగ్, చికిత్స తీసుకోవాలని తెలిపారు.

మద్యపాన వ్యసనం వ్యక్తి ఆరోగ్యంపైనే కాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యపానాన్ని ఆశ్రయించడం సరైన పద్ధతి కాదని, వ్యసనానికి గురైన వారు నిపుణుల సహాయంతో చికిత్స పొందాలని సూచించారు.

పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యక్తిగత సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి ఏర్పడుతుందని తెలిపారు. సమస్యలను మనసులోనే దాచుకోకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలని, అవసరమైనప్పుడు కౌన్సెలింగ్ తీసుకోవాలని సూచించారు.

జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వారిని ఒంటరిగా వదిలేయకుండా వారితో మాట్లాడి ధైర్యం చెప్పాలని, వెంటనే నిపుణుల సహాయం అందించాలని కోరారు.

కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ త్రిఫ్ట్, నేతన్న భీమా పథకాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డం రచన మధుకర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు బల్ల లక్ష్మీపతి, కార్యదర్శి మాదాసు సత్యనారాయణ, గౌడ రాజమహేందర్, మాసం రాజేందర్, భోగ రంగయ్య, జెల్ల సదానందం, కొండి సంపత్, చింతకింది శ్రీకాంత్, ఆకేన శ్రీనివాస్, వేముల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA