Kalva Srirampur: డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి: బీఆర్ఎస్
Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్ పాండవుల గుట్ట వద్ద నిర్మించిన 274 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని మాజీ జడ్పీటీసీ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్ డిమాండ్ చేశారు.
Kalva Srirampur: డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి: బీఆర్ఎస్
పెద్దపల్లి జిల్లా, కాల్వ శ్రీరాంపూర్: గత ప్రభుత్వ హయాంలో పాండవుల గుట్ట సమీపంలో నిర్మించిన 274 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ లు,బిఆర్ఎస్ నాయకులు శనివారం నిరసన తెలిపారు.
తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించిన నాయకులు, గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మార్చకూడదని, వారిని తొలగించకుండా వారికే ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ కి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తే ఇప్పటి ప్రభుత్వం అట్టి ఇళ్లను ఎవరికి ఇవ్వక నిరుపయోగంగా మారుస్తున్నారన్నారు.
మండలంలో ఇప్పటికే 160 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. అయితే మండలంలోని వివిధ గ్రామాల్లో సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు, అర్హులైన లబ్ధిదారులు ఇంకా ఎంతోమంది ఉన్నారని పేర్కొన్నారు.
అందువల్ల గతంలో 160 ఇళ్లను మంజూరు చేసిన విధంగానే, అదే ప్రక్రియను కొనసాగిస్తూ మండలంలోని మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా, నిజమైన అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సర్పంచ్లు బూసి సదశివారెడ్డి, మంతెన రాజయ్య, తీగల నాగరాజు, నాయకులు పుప్పాల నాగార్జున రావు,గొనె శ్యామ్, గరిడే అశోక్, కర్ణాకర్, కనకయ్య,జుకంటి శిరీష,బుర్ర సదానందం,దొమ్మటి శ్రీనివాస్,ఆడెపు రాజు,నిదపురం దేవయ్య,ఓదెలు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




