Julapally: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. ఐకేపీ కేంద్రం వద్ద రైతుల ధర్నా

Julapally: జూలపల్లి మండలం పెద్దాపూర్ ఐకేపీ కేంద్రంలో 20 రోజులుగా మిల్లుల కేటాయింపు జరగక ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు.

RAJU, PEDDAPALLI
Published on: 10 Nov 2026 2:15 PM IST
Julapally
X

Julapally: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. ఐకేపీ కేంద్రం వద్ద రైతుల ధర్నా

జూలపల్లి: జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గత 20 రోజులుగా ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, ఇప్పటివరకు మిల్లుల కేటాయింపు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఇప్పటికే అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయామని, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడిసి నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మిల్లుల కేటాయింపులో జాప్యం కారణంగా రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని రైతులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI