Karimnagar: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఎం ధర్నా

Karimnagar: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని, నిత్యావసరాల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 7 Nov 2026 3:17 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఎం ధర్నా

కరీంనగర్: ఎల్ నినో ప్రభావం దృష్ట్యా కరీంనగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలి, బ్లాక్ మార్కెట్ ను అరికట్టి నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.

జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ధర్నాను ఉద్దేశించి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి, తెలంగాణ రాష్ట్రానికి 50వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి వెంటనే నిధులు విడుదల చేయాలని, జిల్లాకు 2వేల కోట్లు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందాడన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరీంనగర్ జిల్లావ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, జిల్లాలోని 16 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, కరువు జిల్లాగా గుర్తించి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లాలో కేవలం మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందని అన్నారు. జిల్లావ్యాప్తంగా సాగునీరు, తాగునీటి కొరత తీవ్రంగా ఏర్పడిందని, పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని, కరువు ప్రభావిత రాష్ట్రంగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.50 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ సాధించేందుకు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

కరువు వల్ల జరిగిన పంట నష్టాలను సమగ్రంగా శాస్త్రీయంగా క్షేత్రస్థాయిలో అంచనా వేసి వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. జిల్లాలో ఐదు నెలల క్రితం మంత్రులు కరువు నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించినప్పటికీ, నేటికీ కరువు నివారణ ప్రణాళికను అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. సమీక్షలు, ప్రకటనలకే ప్రభుత్వం పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే చర్యలు చేపట్టాలని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.

రైతులకు రుణమాఫీ, రైతు భరోసా రెట్టింపు చేయాలన్నారు. కరువు పరిస్థితుల్లో రైతులు చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెండు లక్షల రూపాయల లోపు పంట రుణాలతో పాటు అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళా సంఘాల రుణాలపై ఏడాది పాటు వడ్డీ రహిత మారిటోరియం ప్రకటించాలని కోరారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సాగు చేయలేని స్థితిలో ఉన్న రైతులకు కూడా రైతు భరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలను వర్తింపజేయాలని అన్నారు. ఐదు ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా మొత్తాన్ని రెట్టింపు చేసి అందించాలని డిమాండ్ చేశారు. ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ఉచితంగా సరఫరా చేయాలని, ఆ పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా మార్కెట్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. బిపిఎల్ కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ఎల్ నినో సాకుతో కొంతమంది వ్యాపారులు నిత్యవసరాలను బ్లాక్ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. మార్కెట్లో బియ్యం కేజీ రూ.100 వరకు విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టి, దందా నడుపుతున్న వ్యాపారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని,సరసమైన ధరలకు నిత్యవసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు 14 రకాల నిత్యావసర సరుకులను కరువు ఉపశమన కిట్ల రూపంలో ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఉపాధి హామీ పనులు 200 రోజులకు పెంచాలన్నారు.కరువు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోయి వ్యవసాయ కార్మికులకు ఉపాధి కరువైందని, కుటుంబ పోషణ కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని, రోజువారీ కూలీని రూ.800కు పెంచాలని డిమాండ్ చేశారు.వ్యవసాయ కూలీలకు కరువు ఉపశమన చర్యల్లో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వం అనవసరమైన ఆడంబరపు ఖర్చులను తక్షణమే నిలిపివేసి పొదుపు చర్యలు పాటించాలని, ఆ నిధులను కరువు బాధితుల ఉపశమనానికి వినియోగించాలని సూచించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, గుడి కందుల సత్యం, జై బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, జి. రాజేశం.డి నరేష్ పటేల్, యు శ్రీనివాస్, జిల్లా నాయకులు గజ్జల శ్రీకాంత్, రాయి కంటి శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, వడ్లూరి కిషోర్, శివకుమార్, మానస, సంజన, సురేష్, ఇసాక్, సిరి ప్రసాద్, సాయి, సిద్దు,ఆకాష్, అభిలాష్, సూర్య తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN