Sircilla: దసరాకు ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ మహేష్

Sircilla: దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రతపై జాగ్రత్తలు వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.

KALEEM, SIRICILLA
Published on: 11 Oct 2026 4:53 PM IST
Sircilla
X

Sircilla: దసరాకు ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ మహేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా: దసరా పండుగ సందర్భంగా స్వగ్రామాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రత విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. పండుగ సమయంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లడాన్ని అదనుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

జిల్లాలో చోరీల నియంత్రణకు పోలీస్ శాఖ తరఫున అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీని ముమ్మరం చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాలు, కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమని స్పష్టం చేశారు.

ఇంటి భద్రతకు పోలీసుల సూచనలు

దసరా పండుగకు ఊళ్లకు వెళ్లే వారు ఇంటికి తాళం వేసిన తర్వాత అది బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఇంట్లోని బంగారం, వెండి, నగదు వంటి విలువైన వస్తువులను బీరువాల్లో ఉంచకుండా సురక్షితమైన బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిదని తెలిపారు. బీరువా తాళాలను ఇంట్లోని కప్‌బోర్డులు లేదా ఇతర ప్రదేశాల్లో ఉంచకూడదని సూచించారు.

విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక వివరాలను ఇతరులతో పంచుకోవద్దని, ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు మెయిన్ డోర్‌తో పాటు ఇతర ద్వారాల భద్రతను నిర్ధారించుకోవాలని పేర్కొన్నారు. ఊరికి వెళ్లే విషయాన్ని పక్కింటి వారికి, సంబంధిత పోలీసులకు తెలియజేస్తే గస్తీ సమయంలో ఇంటిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంటుందని తెలిపారు. రాత్రి సమయంలో ఇంట్లో ఒక గదిలో లైట్ వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇంటి భద్రత కోసం మొబైల్‌కు నోటిఫికేషన్లు వచ్చేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఇంటి చుట్టూ అన్ని వైపులా కవరయ్యేలా కెమెరాలను అమర్చుకోవాలని పోలీసులు సూచించారు. ఇంటి పరిసరాలను గమనిస్తూ ఉండాలని పొరుగువారికి చెప్పి వెళ్లాలని, ఇంట్లో ఉండే మహిళలు, వృద్ధులకు అపరిచిత వ్యక్తులు సమాచారం అడిగే పేరుతో వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలియజేయాలని పేర్కొన్నారు.

గ్రామాలు, కాలనీల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పద కదలికలు గమనించినా ఆలస్యం చేయకుండా డయల్ 112కు సమాచారం అందించాలని ఎస్పీ మహేష్ బి. గితే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA