Karimnagar: ఉద్యోగుల సేవలను కించపరిస్తే సహించేది లేదు దారం శ్రీనివాస్ రెడ్డి

Karimnagar: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లపై లోక్‌సత్తా జెపి చేసిన వ్యాఖ్యలను కరీంనగర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 10 Oct 2026 10:06 PM IST
Karimnagar
X

Karimnagar: ఉద్యోగుల సేవలను కించపరిస్తే సహించేది లేదు దారం శ్రీనివాస్ రెడ్డి

కరీంనగర్: ప్రజాపాలనకు వెన్నెముక ప్రభుత్వ ఉద్యోగులు… వారి సేవలను కించపరిస్తే సహించేది లేదని లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యలపై జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, వారి సేవలు, ఆర్థిక భద్రతపై వాస్తవాలను పక్కనపెట్టి, ప్రజల్లో ఉద్యోగుల పట్ల అపోహలు కలిగించే విధంగా వ్యాసాలు రాయడం, వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యవాదికి తగదని కరీంనగర్ జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అన్నారు. ఒకప్పుడు ఐఏఎస్ అధికారిగా, శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్న లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ వంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలను, వారి సేవలను, పదవీ విరమణ అనంతర భద్రత అవసరాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరు...

దేశ జనాభాలో ప్రభుత్వ ఉద్యోగుల వాటా సుమారు రెండు శాతమే అయినప్పటికీ, ఆ ఉద్యోగుల నిరంతర సేవలతోనే మిగిలిన ప్రజలకు ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, భద్రత వంటి సేవలు అందుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ప్రజాపాలన సాధ్యమవుతుందా? ప్రభుత్వ విధానాలను రూపొందించడం ఒక భాగమైతే, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రజలకు ఫలితాలు అందించడం మరో కీలకమైన భాగం. ఆ బాధ్యతను నిర్వర్తించేది ప్రభుత్వ ఉద్యోగులే. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది, ప్రజల భద్రతకు పోలీసులు, గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ సిబ్బంది, రైతులకు సేవలందించే వ్యవసాయ శాఖ ఉద్యోగులు, ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరవేసే రెవెన్యూ సిబ్బంది, విద్యుత్, నీటిపారుదల, పారిశుద్ధ్య విభాగాల ఉద్యోగులు లేకుండా ప్రభుత్వ వ్యవస్థ ఒక్కరోజైనా సజావుగా నడుస్తుందా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలిచే ఉద్యోగుల సేవలను విస్మరించి, వారిపై విషం చిమ్మే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

ప్రభుత్వ ఉద్యోగం విలాసం కాదు… ప్రజాసేవతో కూడిన బాధ్యత...

ప్రభుత్వ ఉద్యోగం ఎవరికీ ఉచితంగా లభించదు. లక్షలాది మంది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి, పోటీ పరీక్షలకు సిద్ధమై, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని, కుటుంబాల ఆశలను మోస్తూ ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రభుత్వ నిబంధనలు, అధికారుల పర్యవేక్షణ, ప్రజల అవసరాలు, విధి నిర్వహణ ఒత్తిళ్ల మధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఎండనక, వాననక, రాత్రనక, పగలనక విధులు నిర్వహించే ఉద్యోగుల సేవలను గుర్తించకుండా, వారి హక్కులను చిన్నచూపు చూడటం అంటే కేవలం ఉద్యోగులను అవమానించడం మాత్రమే కాదు; ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను, వారి కుటుంబాల ఆశలను కూడా అవమానించడమేనని దారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రజాప్రతినిధుల పెన్షన్లపై ఒక న్యాయం… ఉద్యోగుల పెన్షన్లపై మరో న్యాయమా...

ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారికి వర్తించే పెన్షన్ నిబంధనలు, వారి పదవీకాలానికి సంబంధించిన ప్రయోజనాలు, ఇతర ప్రజా వ్యయాలపై సమగ్రంగా చర్చించకుండా, జీవితాంతం ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగుల పెన్షన్‌పై మాత్రమే ఆర్థిక భారం పేరుతో ప్రశ్నలు లేవనెత్తడం ఎంతవరకు సమంజసం? ప్రజాప్రతినిధుల పెన్షన్లకు సంబంధించిన నిబంధనలు, ఉద్యోగుల పెన్షన్ విధానాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, ప్రజాధనం వినియోగంపై చర్చించేటప్పుడు అందరికీ ఒకే విధమైన పారదర్శకత, ఆర్థిక బాధ్యత, న్యాయబద్ధమైన ప్రమాణాలు ఉండాలి. ఉద్యోగుల హక్కుల విషయంలోనే ఆర్థిక క్రమశిక్షణను ముందుకు తెచ్చి, ఇతర ప్రజా వ్యయాల విషయంలో మౌనం వహించడం ప్రజల్లో అనేక ప్రశ్నలకు తావిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉన్నట్లే, ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత కూడా సమాజానికి ఉంది. ఏ వర్గానికీ అన్యాయం జరగకూడదు. ఉద్యోగుల పెన్షన్‌పై చర్చిస్తే ప్రజాప్రతినిధుల పెన్షన్లు సహా అన్ని సంబంధిత అంశాలనూ వాస్తవాల ఆధారంగా సమగ్రంగా చర్చించాలి.

పెన్షన్ ఇస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తుందా..

కోట్లాది రూపాయల సంపద కలిగినవారికి, ఆర్థికంగా బలమైన వర్గాలకు వివిధ రూపాల్లో అందుతున్న ప్రయోజనాలు, ప్రభుత్వ వ్యయాలపై చర్చించకుండా, చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందించే ఉద్యోగుల పదవీ విరమణ భద్రతపైనే ఆర్థిక భారం అనే ముద్ర వేయడం ఎంతవరకు న్యాయం? ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ కల్పించడం వల్లే ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తుందని భావించడం వాస్తవాలను సరళీకరించడం అవుతుంది. దేశ ఆర్థిక పరిస్థితి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ఆదాయాలు, ఖర్చులు, అప్పులు, సంక్షేమ పథకాలు, ఇతర ఆర్థిక బాధ్యతలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఆర్థిక పరిస్థితిపై నిర్ణయాలకు రావాలి. ఉద్యోగుల పెన్షన్ ఒక్కటే ఆర్థిక వ్యవస్థకు భారమని చిత్రీకరించడం సరికాదు.

పెన్షన్ భిక్ష కాదు… జీవితకాల సేవకు గౌరవం!

ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలో అత్యంత విలువైన సంవత్సరాలను ప్రజాసేవకు అంకితం చేస్తారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు జీతం నుంచి పన్నులు చెల్లిస్తూ, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ, ప్రభుత్వ విధానాల అమలులో భాగస్వాములవుతారు. పదవీ విరమణ తర్వాత గౌరవప్రదంగా జీవించడానికి అవసరమైన సామాజిక, ఆర్థిక భద్రతను కోరుకోవడం వారి న్యాయమైన ఆకాంక్ష.

పెన్షన్‌ను ఎవరో పెట్టే భిక్షగా చూడటం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. పెన్షన్ విధానం ఎలా ఉండాలనే అంశంపై ఆర్థిక నిపుణులు, ప్రభుత్వాలు చర్చించవచ్చు. అయితే, ఆ చర్చ ఉద్యోగుల జీవితకాల సేవలను గౌరవిస్తూ, వారి వృద్ధాప్య భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ జరగాలి. పెన్షన్ విధానంపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ, ఉద్యోగుల హక్కులను కించపరిచే భాషను సమర్థించలేం.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి… వారిని నిందించకూడదు..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు పెండింగ్ డీఏలు, పీఆర్సీ, పెన్షన్ విధానం, ఆరోగ్య పథకాలు, పదవీ విరమణ ప్రయోజనాలు తదితర సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో వారి సేవలను ప్రశ్నిస్తూ, ప్రజలకు ఉద్యోగులకు మధ్య విభేదాలు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. ఉద్యోగుల్లో అసంతృప్తి మాత్రమే పెరుగుతుంది.

ఉద్యోగుల పనితీరుపై నిర్మాణాత్మక విమర్శలు చేయడానికి ఎవరికైనా హక్కు ఉంది. విధుల్లో నిర్లక్ష్యం చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరవచ్చు. కానీ కొందరి పనితీరును సాకుగా చూపి మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థను కించపరచడం సరైన విధానం కాదు. వ్యక్తిగత లోపాలను మొత్తం వ్యవస్థకు ఆపాదించడం మేధావులుగా చెప్పుకునే వ్యక్తులకు తగదు.

ప్రజాసేవను అవమానించవద్దు!

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు శత్రువులు కాదు; ప్రజాసేవలో భాగస్వాములు. ఉద్యోగుల సంక్షేమం, ప్రజల సంక్షేమం పరస్పర విరుద్ధమైనవి కావు. ఉద్యోగులకు న్యాయం జరిగితే వారు మరింత ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో ప్రజలకు సేవలందించగలరు. ఉద్యోగుల హక్కులను గౌరవిస్తూ, ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే నిర్మాణాత్మక చర్చ జరగాలి. ఒకప్పుడు ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నతస్థాయిలో పనిచేసిన వ్యక్తులు క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, పరిమితులు, కుటుంబ బాధ్యతలు, ప్రజల అవసరాలను మరింత లోతుగా అర్థం చేసుకోవాలి.

ఉద్యోగులపై అనవసర విమర్శలు చేయడం కన్నా, వారి సమస్యలకు పరిష్కారాలు సూచించడం మేలైన ప్రజాస్వామ్య సంప్రదాయం. ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఉద్యోగ సంఘాలు సహించబోవు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మా సంఘం కట్టుబడి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులపై విషప్రచారం మానుకుని, వాస్తవాలను తెలుసుకుని బాధ్యతాయుతంగా మాట్లాడాలని జయప్రకాశ్ నారాయణకు సూచిస్తున్నాం అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడం అంటే ప్రజాసేవను అవమానించడమే. పెన్షన్ భిక్ష కాదు—ఉద్యోగి గౌరవప్రదమైన జీవితానికి సంబంధించిన హక్కు. ఉద్యోగుల సేవలను గుర్తించండి… వారి హక్కులను గౌరవించండి అని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవోస్ సంఘం కరీంనగర్ జిల్లా సంగం లక్ష్మణరావు టి ఎన్జీవోల జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN