Karimnagar: కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద ప్రతిరోజూ ‘వందేమాతరం’!

Karimnagar: కరీంనగర్ టవర్ సర్కిల్‌లో రోజూ ఉదయం 8 గంటలకు ‘వందేమాతరం’ ఆలాపన ప్రారంభించిన మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వినూత్న ప్రయత్నం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 2 Oct 2026 7:21 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద ప్రతిరోజూ ‘వందేమాతరం’!

కరీంనగర్: కరీంనగర్‌లోని ప్రముఖ వ్యాపార, వాణిజ్య కూడలి అయిన టవర్ సర్కిల్‌లో టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోనే మొట్టమొదటిసారిగా టవర్ మీద పూర్తి స్థాయి 'వందేమాతరం' గీతాలాపన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు హాజరై, ప్రతిరోజూ ఉదయం 8:00 గంటలకు ప్రసారమయ్యే ఈ పూర్తి స్థాయి వందేమాతర గీతాలాపనను ప్రారంభించారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వందేమాతరం నినాదం కోట్లాది మంది త్యాగధనులలో దేశభక్తి ఉప్పొంగేలా చేసిందని, నేటి తరం యువత మరియు నగర పౌరులలో అదే జాతీయ స్ఫూర్తిని నింపడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఉదయాన్నే నగరంలో ప్రసారమయ్యే ఈ గీతాలాపన ద్వారా ప్రజలలో సానుకూల దృక్పథం, మానసిక ప్రశాంతత మరియు దేశం పట్ల అంకితభావం పెంపొందుతాయని స్పష్టం చేశారు.

నిత్యం వేలాది మంది ప్రజలు సంచరించే చారిత్రాత్మక ప్రధాన కూడలిలో ప్రతిరోజూ ఉదయం 8:00 గంటలకు పూర్తి వందేమాతరం గీతాన్ని వినిపించేలా టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేసిన ఏర్పాట్లు నగరానికే తలమానికమని కొనియాడారు. ఉదయం 8:00 గంటలకు ఈ గీతం ప్రారంభమైనప్పుడు నగర పౌరులు, వ్యాపారులు, వాహనదారులు ఎక్కడికక్కడ గౌరవసూచకంగా నిలబడి జాతీయ భావాన్ని చాటాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంగల పవన్, రామన్, టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వాహకులు, టవర్ సర్కిల్ ప్రాంతానికి చెందిన వైశ్య సోదరులు, మహిళా సోదరీమణులు మరియు నగర పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN