Sircilla: విభిన్న పంటల సాగుతో ఏడాదికి రూ. 4 లక్షల ఆదాయం!

Sircilla: ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ రైతు చింతలకుల చంద్రం 3 ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా విభిన్న పంటలు సాగు చేస్తూ ఏడాదికి రూ. 3–4 లక్షల ఆదాయం పొందుతున్నారు.

KALEEM, SIRICILLA
Published on: 17 Nov 2026 5:05 PM IST
Sircilla
X

Sircilla: విభిన్న పంటల సాగుతో ఏడాదికి రూ. 4 లక్షల ఆదాయం!

సిరిసిల్ల: వరి సాగుకు స్వస్తి చెప్పి.. డ్రిప్ ఇరిగేషన్ విధానంలో విభిన్న రకాల కూరగాయలు సాగు చేస్తూ మెరుగైన ఆదాయం పొందుతున్నారు ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామానికి చెందిన రైతు చింతలకుల చంద్రం. మూడు ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతు సాగు విధానాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అభినందించారు.

చింతలకుల చంద్రం తనకున్న మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకుని డ్రిప్ ఇరిగేషన్ సదుపాయంతో నీటిని పొదుపుగా వినియోగిస్తున్నారు. దోసకాయ, కాకరకాయ, బీరకాయ, టమాట, పచ్చిమిర్చి, వేరుశెనగ వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటలు పండిస్తూ ఏడాది పొడవునా ఆదాయం వచ్చేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్నారు.

రైతు సాగు విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్.. పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి, మార్కెటింగ్, ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తోందని రైతు కలెక్టర్‌కు వివరించారు. పండించిన కూరగాయలను ముస్తాబాద్, సిరిసిల్ల మార్కెట్లలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.

విభిన్న పంటల సాగు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన ఆదాయం పొందుతున్న రైతు చంద్రం సాగు విధానం ఇతర రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

ఈ క్షేత్రస్థాయి పర్యటనలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, వ్యవసాయ శాఖ అధికారి ప్రదీప్, తహసీల్దార్ ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA