Karimnagar: పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కేంద్రం: సీపీఎం ధ్వజం!

Karimnagar: కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని సీపీఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మండిపడ్డారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 11 Oct 2026 7:02 PM IST
Karimnagar
X

Karimnagar: పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న కేంద్రం: సీపీఎం ధ్వజం!

కరీంనగర్: బిజెపి జేబు సంస్థగా, ఏకపక్షంగా, దేశవ్యాప్తంగా పౌరుల ఓట్లు తొలగిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని, శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన సీపీఎం అగ్రనాయకులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, నయా ఫాసిస్టు విధానాలకు నిదర్శనమని సీపీఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి విమర్శించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అత్యున్నత దర్యాప్తు సంస్థలను, స్వతంత్ర సంస్థలను తమ జేబు సంస్థలుగా వాడుకుంటూ దేశంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న బిజెపి ప్రభుత్వం దేశ పౌరులపై దాడులు చేయించడం హేయమైన చర్య అన్నారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, నయా ఫాసిస్ట్ పాలన చేస్తుందన్నారు.

ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను రద్దు చేయాలని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. .

ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ మూడో విడత పూర్తయ్యేసరికి ముసాయిదా ఓటర్ల జాబితాలో దేశవ్యాప్తంగా 14 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించారని ఆరోపించారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని విమర్శించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన వారందరి పేర్లను చేర్చాలని డిమాండ్ చేశారు.

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఆయన పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వేలాది మంది పోలీసులను మోహరించడం, వందలాది రైళ్లను రద్దు చేయడం, మెట్రో స్టేషన్లను మూసివేయడం, ఆందోళనకారులకు ఆహారం, మంచినీరు అందకుండా చేయడం వంటి చర్యలు సిగ్గుచేటని అన్నారు. దేశ పౌరులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వారిపై యుద్ధం ప్రకటించినట్లుగా వ్యవహరించడం అనైతికమని విమర్శించారు.

ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థల స్వతంత్రతను దెబ్బతీస్తూ, రాజకీయ కక్షసాధింపు చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు.

పోలీసుల సమక్షంలోనే బీజేపీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన వ్యక్తులు ఉద్యమకారులపై భౌతిక దాడులకు పాల్పడటం దారుణమని అన్నారు. మహిళలపై దాడులు చేయడం అమానుషమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాపాడాలని, నిర్బంధ చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి వైదొలగాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలని, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సంపత్, డి. నరేష్ పటేల్, నాయకులు తిప్పారపు సురేష్, గజ్జల శ్రీకాంత్, రాయికంటి శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, కె. అరవింద్, పున్నం రవి, రాజ్‌కుమార్, శివ, అరవింద్, బోగేష్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN