Karimnagar: కరీంనగర్ జిల్లాలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి సీపీఎం!

Karimnagar: కరీంనగర్‌లో ప్రబలుతున్న డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధులు. జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి, బీపీ మాత్రలను అందుబాటులో ఉంచాలని సీపీఎం డిమాండ్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 12 Oct 2026 3:18 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ జిల్లాలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి సీపీఎం!

Karimnagar: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా తదితర వైరల్ వ్యాధులతో అనేకమంది ప్రజలు బాధపడుతున్నారు. దాదాపు ప్రతి కుటుంబంలో జ్వరపీడితులు ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వైద్య సదుపాయాలు, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం విచారకరం. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ అవసరం లేని వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, అధిక ఫీజులు వసూలు చేయడంతో ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఒక్కో ఆసుపత్రి ఒక్కో విధంగా వసూళ్లు చేస్తోంది.బీపీ మాత్రలను వెంటనే అందుబాటులో ఉంచాలి. గత రెండు నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లలో బీపీ మాత్రలు అందుబాటులో లేక రక్తపోటు వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మందులు కొనుగోలు చేయలేక, సరైన సమయంలో చికిత్స పొందలేక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రతి నెలా రక్తపోటు పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లలో మందుల కొరత ఉండటంతో రోగులు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. రక్తపోటు నియంత్రణలో లేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లలో బీపీ మాత్రలను తక్షణమే అందుబాటులో ఉంచాలి.

దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలి..

సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. దోమల నివారణకు ప్రతి బస్తీ, ప్రతి గ్రామంలో ఫాగింగ్ యంత్రాల ద్వారా దోమల మందు పిచికారీ చేయించాలి. మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలి.

ప్రతి బస్తీ, ప్రతి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరపీడితులకు, ఇతర వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా అందించాలి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, మందులు, పరీక్షా పరికరాలు, పడకలు తదితర కనీస సదుపాయాలను సమకూర్చాలి.

సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్లు..

కరీంనగర్ జిల్లాలో సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లలో అవసరమైన మందులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. గత రెండు నెలలుగా కొరత ఏర్పడిన బీపీ మాత్రలను వెంటనే సరఫరా చేసి, రక్తపోటు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందించాలి.

డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నిర్ధారణకు అవసరమైన పరీక్షలు, చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించాలి. ప్రతి బస్తీ, ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు తక్షణ వైద్య సహాయం అందించాలి. దోమల నివారణకు జిల్లా వ్యాప్తంగా ఫాగింగ్ నిర్వహించి, పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలి.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు, అనవసర వైద్య పరీక్షల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టి, ఫీజుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలి.

పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కావున, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పై సమస్యలపై తక్షణమే స్పందించి, అవసరమైన చర్యలు చేపట్టాలి.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తిప్పారపు సురేష్, వడ్లూరి కిషోర్ పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN