Sircilla: కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ.. సీఈసీపై చర్యలకు కేకే డిమాండ్!
Sircilla: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని సిరిసిల్లలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 500 బైకులతో భారీ నిరసన ర్యాలీ.
Sircilla: కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ.. సీఈసీపై చర్యలకు కేకే డిమాండ్!
Sircilla: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. సామాన్య ప్రజల ఓటు హక్కును కాపాడాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు 500 బైకులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్‌పై చర్యలు తీసుకునే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఖరిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు తలెత్తకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలని అన్నారు.
ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండటం ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఒకరి ఓటు హక్కు ప్రశ్నార్థకమైతే భవిష్యత్తులో మరొకరి హక్కుకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు.
ర్యాలీలో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కును కాపాడాలని కోరారు. అనంతరం పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాని మోదీకి కనువిప్పు కలగాలని ప్రార్థించారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల వ్యవస్థలు ఓటు హక్కు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల వ్యవస్థ పనితీరుపై ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




