Sircilla: సిరిసిల్లలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Sircilla: సిరిసిల్లలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం!
Sircilla: ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ ఆజ్మతుల్లా హుస్సేన్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను ప్రశంసించారు. శాసనసభలో ముఖ్యమంత్రి తర్వాత ఆది శ్రీనివాస్ చెప్పిన మాటకు ప్రాధాన్యత ఉంటుందని, ఆయన మంచి మనసు, మంచి స్వభావం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. సిరిసిల్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, సీఎం ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.
రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని శపథం చేసి అధికారంలోకి తీసుకొచ్చారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ కార్యకర్తలపై నమోదైన కక్షపూరిత కేసుల అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి ఆది శ్రీనివాస్ కోరిక మేరకు జరుగుతోందని మంత్రి తెలిపారు. రైతులు, నేతన్నల సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని, బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. నేతన్నల కోసం వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, యారన్ డిపోను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగంలో రోల్ మోడల్‌గా నిలుస్తోందని తుమ్మల అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి ఎదురవుతున్న సమస్యల మధ్య కూడా సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
దేశ రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయని, స్వార్థపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయని మంత్రి తుమ్మల విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయాలపై ఆయన విమర్శలు చేశారు. దక్షిణ భారతదేశంలోనూ బీజేపీ విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
సిరిసిల్లలో జరిగే సీఎం బహిరంగ సభ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చర్చకు వేదిక కావాలని మంత్రి ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తల మనోభావాలు, ప్రజల సంక్షేమం తమ బాధ్యత అని చెప్పారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి చూసుకుంటారని అన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నది సీఎం రేవంత్ రెడ్డి కోరిక అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే సీఎం బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభపై చూపుతున్న పట్టుదల, ప్రాధాన్యతను కార్యకర్తలు అర్థం చేసుకుని భారీగా తరలిరావాలని కోరారు.




