Sircilla: లక్ష ఎకరాల సాగుభూమికి శాశ్వత సాగునీరు అందించాలి సీఎం కి వినతి!

Sircilla: ఎగువ మానేరు 9వ ప్యాకేజీ పనులను త్వరగా పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం కోరారు.

KALEEM, SIRICILLA
Published on: 1 Oct 2026 4:20 PM IST
Sircilla
X

Sircilla: లక్ష ఎకరాల సాగుభూమికి శాశ్వత సాగునీరు అందించాలి సీఎం కి వినతి!

Sircilla: ఎగువ మానేరు 9వ ప్యాకేజీ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయడంతో సుమారు లక్ష ఎకరాల సాగుభూమికి శాశ్వతంగా సాగునీరు అందించాలని ఎగువ మానేరు ప్రాజెక్టు పరిరక్షణ సమితి కోరింది. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో మాజీ ఎమ్మెల్యే, ఎగువ మానేరు ప్రాజెక్టు పరిరక్షణ సమితి ప్రతినిధి కటకం మృత్యుంజయం మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అనంతరం ప్రాజెక్టు రూపకల్పనలో మార్పులు చోటుచేసుకుని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో వివిధ ప్యాకేజీలుగా పనులు కొనసాగాయని వివరించారు.

అయితే ఎగువ మానేరు ప్రాంతానికి అత్యంత కీలకమైన 9వ ప్యాకేజీ పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగకపోవడంతో సిరిసిల్ల ప్రాంత రైతులు సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. 9వ ప్యాకేజీ పనులు పూర్తయితే సుమారు లక్ష ఎకరాల సాగుభూమికి శాశ్వత సాగునీటి ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల ప్రాంత పర్యటన సందర్భంగా ఎగువ మానేరు ప్రాజెక్టును స్వయంగా పరిశీలించి, 9వ ప్యాకేజీ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేసి నిర్దిష్ట కాలపరిమితిలో పనులు పూర్తి చేయించాలని కోరారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులను ప్రారంభిస్తే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

అదేవిధంగా ఎగువ మానేరు కుడి, ఎడమ కాలువల పరిస్థితిని పరిశీలించి దెబ్బతిన్న లైనింగ్‌ పనులను పునరుద్ధరించాలని కోరారు. నీటి వృథాను అరికట్టి అందుబాటులో ఉన్న నీటిని రైతుల పొలాలకు సమర్థవంతంగా అందించేలా కాలువ వ్యవస్థను ఆధునీకరించాలని సూచించారు.

పర్యాటకంగా అభివృద్ధి చేయాలి

ఎగువ మానేరు కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాకుండా ప్రకృతి అందాలతో కూడిన ప్రాంతమని కటకం మృత్యుంజయం తెలిపారు. రిజర్వాయర్‌ పరిసరాలను సుందరీకరించి పర్యాటక సదుపాయాలను అభివృద్ధి చేయాలని కోరారు. వ్యూ పాయింట్లు, వాకింగ్‌ ప్రాంతాలు, అవసరమైన చోట్ల బోటింగ్‌ వంటి సదుపాయాలను పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయాభివృద్ధితో పాటు పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ఈ ప్రాంత రైతుల సాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని 9వ ప్యాకేజీ పనులకు నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కటకం మృత్యుంజయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA