Sircilla: ఎస్‌ఐఆర్–2026 పనులు అక్టోబర్ 25లోగా ముగించాలి: సీఈవో

Sircilla: ఎస్‌ఐఆర్–2026 పనులను అక్టోబర్ 25లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 21 Sept 2026 7:21 PM IST
Sircilla
X

Sircilla: ఎస్‌ఐఆర్–2026 పనులు అక్టోబర్ 25లోగా ముగించాలి: సీఈవో

సిరిసిల్ల: ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. నోటీసులు జారీ చేయడంతో పాటు తదుపరి చర్యలు చేపట్టి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ప్రతి బీఎల్‌ఓకు నిర్దిష్ట లక్ష్యాలను కేటాయించి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

అక్టోబర్ చివరి వారంలోగా అనామలీస్, ఇతర మ్యాపింగ్‌కు సంబంధించి ఓటర్లకు జారీ చేయాల్సిన నోటీసులు, వాటి పరిష్కార ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్–2026కు సంబంధించిన అన్ని పనులను అక్టోబర్ 25లోపు పూర్తి చేయాలని, చివరి 10 రోజులను అవసరమయ్యే సవరణలు, ఇతర ప్రక్రియల కోసం కేటాయించుకోవాలని సూచించారు.

ఫారం-6 సమర్పించే సమయంలో డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా అందజేయాలని స్పష్టం చేశారు. ఓటర్లకు జారీ చేసే నోటీసులను బీఎల్‌ఓలు మాత్రమే పంపిణీ చేయాలని తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, విదేశాల్లో ఉన్న ఓటర్ల తరఫున వారి కుటుంబ సభ్యులు విచారణకు హాజరై సంబంధిత పత్రాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈ విషయంపై బీఎల్‌ఓలు సంబంధిత ఓటర్లకు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.

బీఎల్‌ఓ స్థాయిలో ఐదు రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నోటీసుల జారీ, విచారణ, దరఖాస్తుల పరిష్కారం వంటి ప్రతి ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, తహసీల్దార్లు మహేష్, జయంత్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA