Karimnagar: పెండింగ్ నోటీసుల హియరింగ్‌ను త్వరగా పూర్తి చేయాలి!
Karimnagar: కరీంనగర్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయా దేవి, పెండింగ్ నోటీసుల హియరింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం.
Karimnagar: పెండింగ్ నోటీసుల హియరింగ్‌ను త్వరగా పూర్తి చేయాలి!
Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న నోటీసుల హియరింగ్‌ను నిర్ణీత సమయంలోగా త్వరగా పూర్తి చేయాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయా దేవి సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నోటీసులపై తదుపరి చర్యలు ఎలాంటి జాప్యం లేకుండా చేపట్టాలని ఆదేశించారు.
కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలో చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి. శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో బాల మాయా దేవి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.
యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు..జిల్లా కలెక్టర్
కరీంనగర్ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్న జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా యంత్రాంగాన్ని బాల మాయా దేవి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల వారీగా ప్రక్రియ పురోగతి, పెండింగ్ అంశాలను వివరించారు. మిగిలిన ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
పెండింగ్ నోటీసులపై ప్రత్యేక దృష్టి...
ఎస్‌ఐఆర్‌లో భాగంగా నోటీసులు అందుకున్నప్పటికీ నిర్ణీత సమయంలో హియరింగ్‌కు హాజరుకాని ఓటర్ల విషయంలో బీఎల్‌ఓలు మరోసారి వారి ఇళ్లకు వెళ్లాలని బాల మాయా దేవి సూచించారు. వారికి నోటీసులు అందించి, అవసరమైన వివరాలు, ధ్రువీకరణ పత్రాలను సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. నోటీసులపై తదుపరి చర్యలు ఆలస్యం కాకుండా క్షేత్రస్థాయిలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఓటర్లకు అందించిన ప్రతి నోటీసుకు సంబంధించిన వివరాలను పక్కాగా రికార్డు చేసి, ఫైలింగ్ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విచారణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి ఓటరుకు చోటు...
అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా ఓటర్ల జాబితాలో చోటు కోల్పోకుండా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని బాల మాయా దేవి సూచించారు. నోటీసులు సంబంధిత ఓటర్లకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని ఈఆర్వోలు, ఏఈఆర్వోలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, ఓటర్లకు అవసరమైన పత్రాలు, నోటీసులకు సంబంధించిన అంశాలపై స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలని బాల మాయా దేవి ఆదేశించారు. ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నాం
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించిందని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా నిబంధనల ప్రకారం ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసుల పరిశీలన, సంబంధిత పత్రాల స్వీకరణ, దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తి చేస్తున్నారని తెలిపారు. పెండింగ్ నోటీసుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి. శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో షర్మిల, తహసీల్దార్లు, అసిస్టెంట్ ఈఆర్వోలు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




