Peddapalli: వరి సాగులో నీటి సమర్థ వినియోగంతో అధిక దిగుబడులు సాధించాలి!

Peddapalli: పెద్దపల్లిలో ‘వరి వరహాలు’ అభినందన సభ. ఆధునిక పద్ధతులు, నీటి సమర్థ వినియోగంతోనే అధిక దిగుబడులని పేర్కొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.

RAJU, PEDDAPALLI
Published on: 19 Sept 2026 4:20 PM IST
Peddapalli
X

Peddapalli: వరి సాగులో నీటి సమర్థ వినియోగంతో అధిక దిగుబడులు సాధించాలి!

Peddapalli: పెద్దపల్లి రంగంపల్లిలోని వెంకట పద్మ ఫంక్షన్ హాల్‌లో Sow & Reap Climatech ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వరి వరహాలు’ రైతుల అభినందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి సమర్థ వినియోగ పద్ధతులను అవలంబించిన రైతులకు ఎకరాకు రూ.500 చొప్పున ప్రోత్సాహక చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాంప్రదాయ సాగు విధానాల నుంచి ఆధునిక పద్ధతుల వైపు మారాల్సిన అవసరం ఉందన్నారు. వరి సాగులో అవసరమైన సమయంలో మాత్రమే నీటిని అందించడం ద్వారా నీటి వృథాను తగ్గించడంతో పాటు పంట దిగుబడులను మెరుగుపరచవచ్చని తెలిపారు.

పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో రైతులను ఆధునిక వరి సాగు పద్ధతుల వైపు ప్రోత్సహించేందుకు Sow & Reap Climatech చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు, అలాగే Sow & Reap చేస్తున్న బయోచర్, బయోగ్యాస్, ఆగ్రోఫారెస్ట్రీ ప్రాజెక్టులు ఉమ్మడి కరీంనగర్ లో ప్రారంభిచడానికి పూర్తిగా సహకరిస్తాము అని తెలిపారు . ఆధునిక సాగు పద్ధతులను అనుసరించి విజయవంతమైన రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవాలని సూచించారు.

జిల్లా వ్యవసాయ అధికారి బి. శ్రీనివాస్ మాట్లాడుతూ, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు రైతులు ప్రత్యామ్నాయ తడిపి–ఆరబెట్టే విధానం (Alternate Wetting and Drying – AWD) వంటి ఆధునిక పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఈ విధానం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు రైతులు తమ వంతు సహకారం అందించవచ్చని తెలిపారు.

Sow & Reap Climatech COO ఎన్. మురళీధర్ మాట్లాడుతూ, వరి సాగులో నీటి వినియోగాన్ని శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా రైతులకు నీటి పొదుపుతో పాటు సాగు సామర్థ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉందన్నారు. రైతులు కొత్త పద్ధతులను స్వీకరించి వాటి ప్రయోజనాలను అనుభవంలోకి తీసుకురావడం ద్వారా నీటి వనరుల సంరక్షణకు, స్థిరమైన వ్యవసాయానికి బలమైన పునాది వేయగలరని తెలిపారు. రైతుల భాగస్వామ్యంతో నీటి పొదుపు పద్ధతులను మరింత విస్తృతంగా ప్రోత్సహించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు.

Sow & Reap Climatech డైరెక్టర్ డి. దివ్యా రెడ్డి మాట్లాడుతూ, రైతులు ఆధునిక సాగు పద్ధతులను స్వీకరించి నీటిని పొదుపు చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావడం తమ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. వరి పొలాల్లో నీటిని నిరంతరం నిల్వ ఉంచకుండా అవసరానికి అనుగుణంగా తడిపి–ఆరబెట్టే విధానాన్ని పాటించడం ద్వారా మీథేన్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

దీని ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో వ్యవసాయ రంగం కూడా తన వంతు పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు అవలంబిస్తున్న ఈ నీటి పొదుపు, పర్యావరణహిత సాగు పద్ధతులు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన నేల, మెరుగైన పర్యావరణాన్ని అందించేందుకు దోహదపడతాయని దివ్యా రెడ్డి అన్నారు.

రైతులకు నీటి పొదుపు, శాస్త్రీయ సాగు విధానాలు, ఆధునిక సాంకేతికతపై మరింత అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ, సంబంధిత సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏడీ కంఠయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీనాథ్, డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పెద్దపల్లి మరియు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తూము రవీందర్ పటేల్, హైకోర్టు అడ్వకేట్ మరియు యువ జనతా ఫౌండేషన్ అధ్యక్షుడు బుద్దార్తి నవీన్, ఎంఏఓ నాగార్జున పాల్గొన్నారు.

Sow & Reap Climatech తరఫున COO ఎన్. మురళీధర్, డైరెక్టర్ డి. దివ్యా రెడ్డి, ఆపరేషన్స్ మేనేజర్ సీహెచ్. వెంకట రమణ, NBS హెడ్ పృథ్వీరామ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి. స్వప్నతో పాటు సంస్థ బృందం, రైతులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI