Peddapalli: చామనపల్లి పునరావాసానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లిలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, పునరావాస కమిషనర్ పర్యటించారు. ముంపు గ్రామం తరలింపునకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

RAJU, PEDDAPALLI
Published on: 8 Oct 2026 6:59 PM IST
Peddapalli
X

Peddapalli: చామనపల్లి పునరావాసానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు!

పెద్దపల్లి: చామనపల్లి గ్రామ పునరావాసానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ధర్మారం మండలం చామనపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం భూసేకరణ, పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు మరియు శ్రీ శ్రీనివాస రావు గుప్త చీఫ్ ఇంజనీర్ (ఇరిగేషన్ ) రామగుండం ల తో కలిసి జిల్లా కలెక్టర్ గ్రామస్థులతో సమావేశం నిర్వహించి, గ్రామ పునరావాసం, భూసేకరణకు సంబంధించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో విస్తృతంగా కాలినడకన పర్యటించి పలు ఇళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, భారీ వర్షాలు, వరదల సమయంలో గ్రామం ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అనేక మంది గ్రామస్థులు తమకు వినతులు సమర్పించారని తెలిపారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని చామనపల్లి గ్రామంలో భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.

మేడారం రిజర్వాయర్ ఎఫ్‌ఆర్‌ఎల్‌కు సంబంధించి 100 మీటర్ల పరిధి వరకు అవసరమైన తరలింపు ప్రక్రియను తక్షణమే చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. అయితే మొత్తం గ్రామాన్ని పునరావాసం చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు.

గ్రామస్థుల అభిప్రాయాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

భూసేకరణ, పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు మాట్లాడుతూ,జిల్లా కలెక్టర్ ద్వారా అందిన ప్రజల వినతుల మేరకు చామనపల్లి గ్రామంలో భూసేకరణ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, గ్రామస్థుల నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం తనను పంపినట్లు చెప్పారు.

గ్రామంలో సుమారు 140 ఇళ్లు ముంపునకు గురయ్యే పరిస్థితి ఉందని కమిషనర్ తెలిపారు. గ్రామంలోని పాఠశాల, మహిళా సమాఖ్య భవనం వంటి నిర్మాణాలను ఇప్పటికే ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం అవి ముంపునకు గురికావడం లేదని పేర్కొన్నారు.

పునరావాస కాలనీని అభివృద్ధి చేసి అర్హులైన వారికి ఇంటి స్థలాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి వ్యక్తికి నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు చేపడతామని చెప్పారు.

ముంపు కారణంగా జీవనోపాధిని కోల్పోయే వారికి కూడా నిబంధనల మేరకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్థుల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య, ఇరిగేషన్ అధికారులు,సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI