Peddapalli: ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందాలి: కలెక్టర్ శ్రీహర్ష!
Peddapalli: రామగిరి మండలం పన్నూర్లో ఇందిరమ్మ బీమా, ఎస్ఐఆర్ శిబిరాలను, మంథని పుష్కర ఘాట్ పనులను పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం పరిశీలించారు.
Peddapalli: ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందాలి: కలెక్టర్ శ్రీహర్ష!
Peddapalli: ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రయోజనం అందేలా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా సేకరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. అలాగే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మంథనిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద 2027 పుష్కరాలను పురస్కరించుకొని చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. గైర్హాజరు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, మరణించిన ఓటర్ల జాబితాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. జాబితాలో పేర్లు తొలగింపునకు గుర్తించినప్పటికీ గ్రామంలోనే నివసిస్తున్న ఓటర్లు ఉంటే, నిబంధనల ప్రకారం వారి నుంచి ఎన్నిమోరేషన్ ఫారాలను సేకరించాలని తెలిపారు.
బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను నిర్ధారించుకోవాలని, స్థానిక ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్ల సహకారంతో జాబితాలను పరిశీలించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఎన్నిమోరేషన్ ఫారాల సేకరణను త్వరగా పూర్తి చేయాలని, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భద్రత
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రతి కుటుంబం నుంచి లబ్ధిదారుని పేరు, నామినీ వివరాలను తప్పనిసరిగా సేకరించాలని అధికారులకు సూచించారు. కుటుంబ వివరాలు, నామినీ పేరు, లబ్ధిదారునితో ఉన్న సంబంధం తదితర వివరాలను సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో సరిపోల్చి నమోదు చేయాలని తెలిపారు.
వివరాల నమోదు సమయంలో పేర్లలో అక్షర దోషాలు, అసంపూర్ణ సమాచారం లేకుండా చూడాలని, భవిష్యత్తులో బీమా క్లెయిమ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. శిబిరాలకు రాని కుటుంబాలను గుర్తించి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని, అర్హులైన ఏ కుటుంబం కూడా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పుష్కరాల పనులను గడువులోగా పూర్తి చేయాలి
అనంతరం మంథని గోదావరి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతి, ప్రారంభం కావాల్సిన పనులు, డిజైన్ అనుమతులు పెండింగ్లో ఉన్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
2027 గోదావరి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. డిజైన్ ఆమోదాలు పెండింగ్లో ఉన్న పనులకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని వెంటనే అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.
ప్రారంభమైన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు సురక్షితమైన స్నాన సౌకర్యాలు, తాగునీరు, పారిశుధ్యం, లైటింగ్, మరుగుదొడ్లు, రాకపోకలకు అనువైన మార్గాలు, భద్రత వంటి మౌలిక సదుపాయాలను కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో రామగిరి తహసీల్దార్ సుమన్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




