Peddapalli: ఎంపీ వంశీకృష్ణను విస్మరిస్తున్న కలెక్టర్ వైఖరి సరికాదు!

Peddapalli: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను విస్మరిస్తూ ఒక ఎమ్మెల్యే కార్యక్రమాలకే కలెక్టర్ ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని శుక్రవారం డానియల్ విమర్శించారు.

RAJU, PEDDAPALLI
Published on: 20 Nov 2026 2:42 PM IST
Peddapalli
X

Peddapalli: ఎంపీ వంశీకృష్ణను విస్మరిస్తున్న కలెక్టర్ వైఖరి సరికాదు!

Peddapalli: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులందరికీ సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను విస్మరిస్తూ ఒక ఎమ్మెల్యే కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వడం సరైన పద్ధతి కాదని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాల జిల్లా అధ్యక్షుడు డానియల్ అన్నారు. ఎంపీ వంశీకృష్ణకు జిల్లా కలెక్టర్ తగిన గౌరవం ఇవ్వకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డానియల్ మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులని, వారందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌పై ఉందన్నారు. ఒక ఎమ్మెల్యే కార్యక్రమాలకే ప్రాధాన్యతనిస్తూ ఎంపీకి తగిన ప్రాధాన్యత, గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు.

మూడు సంవత్సరాల క్రితం గడ్డం వంశీకృష్ణకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు లేని అభ్యంతరాలు ప్రస్తుతం ఎందుకు వ్యక్తమవుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యేల కార్యక్రమాలను ప్రజలకు దూరం చేయాలనే ఉద్దేశంతో కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు.

కనీసం షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా, వివరణ ఇచ్చే అవకాశం కల్పించకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొయ్యూరులో పేద విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా పాఠశాల బ్యాగులు పంపిణీ చేసిన సందర్భంలో ఓ ఎస్టీ మహిళను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, శ్రీరాంపూర్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అన్నారు. ఈ అంశాలపై జిల్లా కాంగ్రెస్ నాయకత్వం సమగ్ర విచారణ జరిపి న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. రోస్టర్ విధానంలో మాలలకు అన్యాయం జరుగుతోందని, 1 నుంచి 20 వరకు ఉన్న రోస్టర్ పాయింట్లలో తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆరోపించారు. మాలలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మాలలను ఓపెన్ కేటగిరీలో చేర్చాలని డిమాండ్ చేశారు.

దివంగత కాకా వెంకటస్వామి తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా బలమైన మాల నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన కుటుంబాన్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలను మాల సమాజం గమనిస్తోందన్నారు. గడ్డం వివేక్, గడ్డం వంశీకృష్ణలను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ఇబ్బందులకు గురిచేయడం ద్వారా మొత్తం మాల సమాజాన్ని బలహీనపరచలేరని హెచ్చరించారు.

రానున్న రోజుల్లో మాలలు, బలహీనవర్గాలు, బీసీలు, మైనార్టీలు ఐక్యంగా ముందుకు వచ్చి బలమైన రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. మాల సమాజం ఐక్యంగా నిలబడి తమ రాజకీయ బలాన్ని నిరూపించుకుంటుందని డానియల్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాల పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కోడి సంజీవరావు, సంఘం ఉపాధ్యక్షుడు కనుమల్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI