Vemulawada: రాజన్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్!

Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Nov 2026 9:26 PM IST
Vemulawada
X

Vemulawada: రాజన్న ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్!

వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వీటీఏడీఏ వైస్ చైర్‌పర్సన్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వీటీఏడీఏ (వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఆధ్వర్యంలో చేపడుతున్న రాజన్న ప్రధాన ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. కృష్ణశిలలతో నిర్మిస్తున్న తూర్పు రాజగోపురం పనులను పరిశీలించారు. అలాగే అనివేటి మండపం, ఆలయ కోనేరు వద్ద కృష్ణశిలలతో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఆర్ అండ్ బీ, ఆలయ అధికారులతో చర్చించారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాజన్న ప్రధాన ఆలయ విస్తరణతో పాటు ఇతర అభివృద్ధి పనులన్నీ పక్కా ప్రణాళికతో చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పనుల్లో వేగం పెంచాలని, అవసరమైన మేరకు కార్మికుల సంఖ్యను పెంచి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. ఆయా పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.

ఈ పరిశీలనలో ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లానాయక్, వేములవాడ ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, మున్సిపల్ కమిషనర్ లోకేష్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA