Sircilla: హనుమాజీపేట పీహెచ్‌సీలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ!

Sircilla: వేములవాడ మండలం హనుమాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బందికి కీలక ఆదేశాలిచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 7 Oct 2026 4:31 PM IST
Sircilla
X

Sircilla: హనుమాజీపేట పీహెచ్‌సీలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మిక తనిఖీ!

సిరిసిల్ల: వేములవాడ వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మండలం హనుమాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ప్రతిరోజూ ఓపీకి ఎంతమంది వస్తున్నారు, ప్రసవాల సంఖ్య ఎంత ఉందనే వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఇమ్యూనైజేషన్ గది, ఇన్‌పేషెంట్ గదులు, ఫార్మసీతో పాటు ఆసుపత్రిలోని ఇతర గదులు, పరిసరాలను పరిశీలించారు.

ఆరోగ్య కేంద్రంలోని ఏఎన్‌ఎంలతో మాట్లాడిన కలెక్టర్.. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టి సారించి, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని సూచించారు.

ఎన్‌సీడీ స్క్రీనింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ముందస్తు స్క్రీనింగ్ ద్వారా వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణ, పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA