Siricilla: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - ఏర్పాట్లు పక్కాగా చేయాలి..కలెక్టర్!

Siricilla: ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాక. పర్యటన ఏర్పాట్లపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్.

KALEEM, SIRICILLA
Published on: 28 Sept 2026 11:24 AM IST
Siricilla
X

Siricilla: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - ఏర్పాట్లు పక్కాగా చేయాలి..కలెక్టర్!

Siricilla: ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. ఎస్పీ మహేష్ బి. గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్ వద్ద ఉన్న మైదానంలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్నారని తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్ అధికారులు హెలిప్యాడ్, పబ్లిక్ మీటింగ్ ప్రాంగణంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

ఆర్‌అండ్‌బీ ఈఈ హెలిప్యాడ్, శంకుస్థాపన స్థలం వద్ద స్టేజ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి పబ్లిక్ మీటింగ్ ప్రాంగణంలో పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్‌పీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరాతో పాటు ఇతర విద్యుత్ ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రోటోకాల్ ప్రకారం అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, సీఎం పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖితతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA