Sircilla: కార్మిక హక్కుల పరిరక్షణ కోసం డిసెంబర్ 1 నుంచి చలో ఢిల్లీ: సీఐటీయూ
Sircilla: కార్మిక హక్కుల పరిరక్షణ, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీ పోస్టర్లను సిరిసిల్లలో సీఐటీయూ నేతలు ఆవిష్కరించారు.
Sircilla: కార్మిక హక్కుల పరిరక్షణ కోసం డిసెంబర్ 1 నుంచి చలో ఢిల్లీ: సీఐటీయూ
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కార్మికులంతా కార్మిక హక్కుల పరిరక్షణ కోసం చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఐటీయూ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మిక చట్టాలు, హక్కుల పరిరక్షణ కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను సిరిసిల్ల బీవై నగర్‌లోని కామ్రేడ్ అమృతలాల్ శుక్లా కార్మిక భవన్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ.. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం మార్చి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ కోడ్‌ల ద్వారా కార్మికుల హక్కులకు భంగం కలుగుతుందని, కార్మికులను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులతో డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
కార్మిక చట్టాలు, హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ పోరాటంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు, కష్టజీవులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు సూరం పద్మ, అన్నల్దాస్ గణేష్, ఎలిగేటి రాజశేఖర్, మిట్టపెల్లి రాజమల్లు, సిరిమల్ల సత్యం, గోవిందు లక్ష్మణ్, భాస శ్రీధర్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.




