Kondagattu: వైభవంగా చందనోత్సవాలు.. 60 ఏళ్ల తర్వాత సింధూర తొలగింపు!

Kondagattu: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత మూలవిరాట్టు సింధూర తొలగింపు ప్రక్రియ చందనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

ANAND, JAGITYAL
Published on: 16 Nov 2026 11:46 AM IST
Kondagattu
X

Kondagattu: వైభవంగా చందనోత్సవాలు.. 60 ఏళ్ల తర్వాత సింధూర తొలగింపు!

Kondagattu: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో చందనోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా ప్రారంభమయ్యాయి. సుమారు 60 ఏళ్లుగా స్వామివారి మూలవిరాట్టుపై పేరుకుపోయిన సింధూరం, చందనం తొలగించే మహా క్రతువుకు అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు.

శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు:

ఉత్సవాల్లో భాగంగా జీయర్లు, రుత్వికులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. లోకకల్యాణార్థం విష్ణు సహస్రనామ పారాయణం, మృత్యుంజయ హోమం తదితర పూజలను ఘనంగా జరిపారు.

బాలాలయంలో భక్తుల దర్శనం:

మూలవిరాట్టుపై చందనం తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నందున గర్భాలయాన్ని చెక్క తలుపులతో మూసివేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గర్భాలయం ఎదుట ప్రత్యేకంగా 'బాలాలయం' ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతిష్ఠించిన స్వామివారి చెక్క విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు.

ఐదు రోజుల పాటు సేవల నిలిపివేత:

చందనం తొలగింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు, అంటే రానున్న ఐదు రోజుల పాటు ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు, ప్రత్యేక పూజలను నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) అంజనారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకల్లో ఆలయ ఈవో అంజనారెడ్డితో పాటు ప్రధాన అర్చకులు జితేంద్రప్రసాద్, చిరంజీవి, స్థానాచార్యులు కపిందర్ తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL