Peddapalli: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం!

Peddapalli: భూపతిపూర్‌లో రూ.1.15 కోట్లతో మహిళల ఆధ్వర్యంలో చైతన్య జ్యోతి పెట్రోల్ పంపును ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు, కలెక్టర్ శ్రీహర్ష.

Srimanthula Kondal, Peddapalli
Published on: 3 Oct 2026 3:23 PM IST
Peddapalli
X

Peddapalli: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం!

Peddapalli: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు.

శనివారం సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో స్వశక్తి సంఘాల మహిళల ఆధ్వర్యంలో సుమారు రూ.1.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన చైతన్య జ్యోతి పెట్రోల్ పంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. మహిళల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయడంతో పాటు చిన్న దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, స్కూల్ యూనిఫామ్‌ల కుట్టు కేంద్రాలు తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు.

పెద్దపల్లి నుంచి స్వశక్తి సంఘాల మహిళల ఆధ్వర్యంలో 7 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని ప్రభుత్వ విప్ తెలిపారు. మహిళలు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో స్వశక్తి సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ తెలిపారు. వడ్డీలేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 15,715 స్వశక్తి సంఘాలకు రూ.33.42 కోట్ల మేర రుణాలు అందించామని వివరించారు.

మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు బీమా భరోసా కూడా కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో సహజ మరణానికి రూ.30 వేల వరకు, ప్రమాద మరణానికి రూ.70 వేల వరకు బీమా సౌకర్యం ఉండేదని, అనంతరం ఈ పథకం నిలిచిపోయిందని చెప్పారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం సహజ మరణం సంభవించిన మహిళలకు రూ.2 లక్షల రుణ బీమా, ప్రమాదవశాత్తు మరణించిన మహిళలకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోందన్నారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 99 మంది మహిళలు సహజ మరణం చెందగా వారి కుటుంబాలకు రూ.75 లక్షల మేర రుణ బీమా ప్రయోజనం అందించామని, ఆరుగురు మహిళలు ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబాలకు రూ.60 లక్షల ప్రమాద బీమా అందించామని ప్రభుత్వ విప్ తెలిపారు. ప్రతి మహిళా సమావేశంలో ఈ వివరాలను తెలియజేసి, ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

IKP కేంద్రాలను స్వశక్తి సంఘాల మహిళలు నిర్వహిస్తున్నారని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని అన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని, IKP కేంద్రాల నిర్వహణలో ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని సూచించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్‌నినో పరిస్థితులు ఉన్నాయని, దీంతో నీటి లభ్యతపై ప్రభావం పడుతోందని ప్రభుత్వ విప్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మంచి వర్షపాతం నమోదైనప్పటికీ గత సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం నీటి లభ్యత తక్కువగా ఉందన్నారు. ఇతర జిల్లాల్లోని చిన్న చెరువుల్లో కూడా నీటి లభ్యత తక్కువగా ఉందని చెప్పారు. గత యాసంగిలోనే గ్రామాల్లోని చెరువులను నింపేందుకు ప్రభుత్వం నీటిని విడుదల చేసిందని తెలిపారు.

ఈ యాసంగిలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ సూచించారు. ఆయిల్‌పామ్, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసుకోవాలని కోరారు. వచ్చే సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిస్తే వరి సాగు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. స్వశక్తి సంఘాల మహిళలకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని, జిల్లాలో ఇప్పటివరకు ఆరుగురు సభ్యులు ప్రమాదాల్లో మరణించగా వారి కుటుంబాలకు రూ.60 లక్షల బీమా అందించామని తెలిపారు. సహజ మరణం సంభవించిన మహిళలకు రూ.2 లక్షల రుణ బీమా సౌకర్యం కూడా అందుబాటులో ఉందన్నారు.

మహిళలకు విహబ్, పెట్రోల్ పంపులు తదితర ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. మంథనిలో టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, గత మూడు సంవత్సరాలుగా వడ్డీలేని రుణాల విధానాన్ని తిరిగి అమలు చేస్తున్నామని చెప్పారు. స్వశక్తి సంఘాల మహిళలకు సుమారు రూ.33 కోట్ల మేరకు వడ్డీ రాయితీ ప్రయోజనం అందించామని తెలిపారు. వడ్డీలేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు.

TASK ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాల కల్పన

మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు TASK ద్వారా ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గత మూడు సంవత్సరాల్లో సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించగా, వారిలో సుమారు 60 శాతం మంది మహిళలేనని చెప్పారు. డిగ్రీ, పీజీ చదివిన మహిళలను గుర్తించి వారికి రుణాలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు వెళ్లి ఉద్యోగం చేయలేని మహిళలకు జిల్లాలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

ఒంటరి మహిళలకు ఆయిల్‌పామ్ సాగులో ప్రత్యేక ప్రోత్సాహం

ఒంటరి మహిళలకు ప్రత్యేకంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఆయిల్‌పామ్ మొక్కలు, డ్రిప్ ఏర్పాటుకు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందిస్తుండగా, మిగిలిన 10 శాతం వాటాను కూడా జిల్లా యంత్రాంగం భరించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మరిన్ని కొత్త మార్గాలను సూచిస్తే వాటిని కూడా ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ అన్నయ్య గౌడ్, డీఆర్‌డీఓ కలిందిని, అడిషనల్ డిఆర్డిఓ రవీందర్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, స్వశక్తి సంఘాల మహిళలు, తదితరులు ,పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli