Karimnagar: కేంద్ర నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి: యాదగిరి సునీల్ రావు

Karimnagar: ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో వేల కోట్ల కేంద్ర నిధులు రావడంతోనే కరీంనగర్ రూపురేఖలు మారాయని బీజేపీ నేత సునీల్ రావు స్పష్టం చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 18 Sept 2026 6:57 PM IST
Karimnagar
X

Karimnagar: కేంద్ర నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి: యాదగిరి సునీల్ రావు

కరీంనగర్: నరేంద్ర మోడీ గత 25 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశానికి సేవ చేస్తూ...భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు.

కరీంనగర్ లో ఎస్ బి ఎస్ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్ నగరానికి పెద్ద ఎత్తున నిధుల వరద కొనసాగుతూ అభివృద్ధి పనులతో నగర రూపు రేఖలు మారాయన్నారు.

కరీంనగర్ నగరానికి ఒక వైపు స్మార్ట్ సిటీ, అమృత్, యూఐడిఎఫ్, యూసిఎఫ్ నిధులతో పాటు రైల్వేస్టేషన్ ఆధునీకరణ, ఆర్ ఓ బి, సిఆర్ఎఫ్ లాంటి ఇన్ని రకాల నిధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వం నుండి మంత్రి బండి సంజయ్ కుమార్ నిధులు తెచ్చి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు.

స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ లో 46 ప్రాజెక్టు పనులకు దాదాపు 40 ప్రాజెక్టులు పూర్తి కాగా 6 ప్రాజెక్టుల పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా నగరాభివృద్ధికి 934 కోట్ల నిధులు విడుదల అయిన మాట వాస్తవమన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనుల ద్వారా కరీంనగర్ నగర రూపు రేఖలు మారింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై విమర్శలు చేస్తున్న నాయకులు ఈ విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మండి పడ్డారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నా ఏ ఒక్క నాయకుడైనా కరీంనగర్ నగర అభివృద్ధి కోసం ఆలోచన చేశారా అని నిలదీశారు. కరీంనగర్ నగర తలాపున మానేరు డ్యాం ఉండి ప్రజలకు ప్రతి రోజు సురక్షితమైన తాగునీరు అందించాలని కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఏ నాయకుడైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ నాయకత్వంలో అమృత్ పథకాన్ని తీసుకొచ్చే వరకు ఏ నాయకుడైనా నగర ప్రజల శ్రేయస్సు పట్టింపు చేశారా అని మండి పడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నగర ప్రజల తాగునీటి కోసం అమృత్ పథకంలో 132 కోట్ల నిధులు తెచ్చి కొత్తగా ట్యాంకులు, పైపు లైన్, ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేసి ప్రజలకు తాగునీరు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు.

రెండున్నర సంవత్సరాల కాలంలోనే కరీంనగర్ టూ హన్మకొండ జాతీయ రహదారి నిర్మాణం పనులు కూడా పూర్తయ్యాయని అన్నారు. ఎన్నో ఏళ్లు ఎంతో మంది మంత్రులు, నాయకులు ఉన్నారు కదా... అభివృద్ధి పై ఎందుకు ఆలోచన లేదని ధ్వజమెత్తారు. జగిత్యాల - కరీంనగర్ రహదారికి కూడా అనుమతులు లభించాయని, త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ఈ విధంగా కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ నగర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని... పనులను వేగవంతంగా పూర్తి చేసి నగరాన్ని సుందర నగరంగా మారుస్తామన్నారు. నగర ప్రజలు ఇచ్చిన మాట ప్రకారం భారతీయ జనతా పార్టీని నమ్మి ఓటు వేసి కార్పొరేషన్ లో పాలకవర్గానికి అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి... ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ.... బురద జల్లుకుని.... కాలయాపన చేసే పార్టీ బీజేపీ కాదని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే... మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయం అని సవాల్ విసిరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే... తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో పక్క రాష్ట్రాల మాదిరిగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారతీయ జనతా పార్టీ పై ప్రజలు విశ్వసిస్తున్నారని... వారికి బీజేపీ పై పూర్తి స్థాయి నమ్మకం ఉందని వెల్లడించారు. అభివృద్ధి సాగాలంటే మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మా పై ఉన్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

కరీంనగర్ నగరాన్ని యూసిఎఫ్ ప్రాజెక్టులో చేర్చి.... 840 కోట్ల రూపాయల నిధులు తెచ్చిన దమ్మున్న నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లాగే మిగతా కార్పొరేషన్లలో నాయకులు, మంత్రులు ఉన్నారు కదా... మిగతా కార్పొరేషన్లకు ఈ విధంగా యుసిఎఫ్ నిధులు ఎందుకు రావడం లేదు, ఎందుకు శాంక్షన్ కావడం లేదు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కేంద్ర ప్రభుత్వం నుండి పథకాలు, నిధులు తేవాలంటే సత్తా.... దమ్ముండాలని.... దమ్మున్న నాయకుడు బండి సంజయ్ కుమార్ అని కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేయాలనే తపన, ఆలోచన ఉన్న గొప్ప నాయకుడు బండి సంజయ్ కుమార్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి కరీంనగర్ ను అభివృద్ధి చేస్తా ఉంటే కొంత మంది కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నాయకులు తెలిసి తెలియక అనాలోచిత జ్ఞానంతో విమర్శలు చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.

అభివృద్ధి కోసం అణా పైసా తేలేని నాయకులు... ఓర్వలేక బండి సంజయ్ కుమార్ పై తప్పుడు కూతలు కూస్తున్నారని.... దమ్ముంటే నగర అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. స్కీంలు తేవడం చేతకాదు.... నిధులు తెచ్చే సత్తాలేదు కానీ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం చేతకాని నాయకులకు బండి సంజయ్ కుమార్ ను విమర్శలు చేసే అర్హత లేదని మండి పడ్డారు.

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న బండి సంజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. అభివృద్ధి చేస్తున్నది బీజేపీ కాబట్టే మా పార్టీని మా నాయకులను విశ్వసిస్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అని కార్పొరేషన్ లో అధికారం కట్టబెట్టారని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్లు సోమిడి వేణు, పొన్నం లక్ష్మి-మొండయ్య, నాంపల్లి రేణుక-శ్రీనివాస్, కర్రె పద్మ-అనిల్, కో-ఆప్షన్ సభ్యులు సర్దార్ బల్వీర్ సింగ్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బండి ప్రశాంత్ దీపక్, బీజేపీ నాయకులు కటకం లోకేష్ కుమార్, టి.చంద్రమౌళి, పండుగ నాగరాజు, వాసు, సత్యనారాయణ రెడ్డి, కుంభం అనిల్ కుమార్, హమీద్, దాసరి రమేష్, ఐలేని రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR