Sircilla: క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి: సిరిసిల్ల జర్నలిస్టుల పోరు

Sircilla: రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ సిరిసిల్లలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సీఎంకు పోస్ట్‌కార్డుల ఉద్యమం చేపట్టారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Oct 2026 7:29 PM IST
Sircilla
X

Sircilla: క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి: సిరిసిల్ల జర్నలిస్టుల పోరు

సిరిసిల్ల: అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వెంటనే క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేసి మెరుగైన వైద్య భద్రత కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143), తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీలు డిమాండ్ చేశాయి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్లలో పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు.

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని గాంధీ విగ్రహానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టులకు వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. జర్నలిస్టులు, వారి కుటుంబాల వైద్య అవసరాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని కోరారు.

అనంతరం సిరిసిల్ల హెడ్ పోస్టాఫీసుకు చేరుకున్న జర్నలిస్టులు ప్రత్యేకంగా పోస్ట్‌కార్డులపై తమ డిమాండ్‌ను రాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించారు. “అర్హులైన జర్నలిస్టులందరికీ క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి” అనే ప్రధాన డిమాండ్‌తో పోస్ట్‌కార్డులను పంపించారు.

విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వారి ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఎలాంటి నగదు చెల్లింపులు లేకుండా ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేలా క్యాష్‌లెస్ హెల్త్ కార్డు సదుపాయాన్ని త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య భద్రత కల్పించాలని, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టడంతో పాటు పెండింగ్‌లో ఉన్న సంక్షేమ అంశాలను పరిష్కరించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సామల గట్టు, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి, అనిల్ రావు, పరశురాం, కంటాల విజయ్, పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి రఘువీర్, మల్లిక్, కాశీ, తంగళ్లపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరసయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ, ఫహద్ పాషా, ఇమ్రాన్, నయీం, బాలరాజు, బాబు, సలీం, నాగరాజు, అస్లాం, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA