Rangampalli: రంగంపల్లిలో కిరాణా షాపులో చోరీ - వికలాంగుడైన యజమాని ఆవేదన
Rangampalli: పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లి 11వ వార్డులో వికలాంగుడైన శ్రీనివాస్ కిరాణా షాపు తాళాలు తీసి రూ.40 వేల విలువైన వస్తువులు, నగదును దొంగిలించారు.
Rangampalli: రంగంపల్లిలో కిరాణా షాపులో చోరీ - వికలాంగుడైన యజమాని ఆవేదన
పెద్దపల్లి: పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లి 11వ వార్డులో కిరాణా షాపులో చోరీ కలకలం రేపింది. షాపు యజమాని శ్రీనివాస్ ప్రతిరోజూ షాపు మూసివేసిన తర్వాత స్కూటీ డిక్కీలో తాళాలు పెట్టి, బండిని ఇంటి ముందు పార్క్ చేసేవారు.
నిద్రిస్తున్న సమయంలో దొంగలు స్కూటీ డిక్కీని పగలగొట్టి తాళాలు అపహరించి, ఆ తాళాలతో షాపు తెరిచి చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాలను సైతం కట్ చేసి దొంగతనం చేసినట్లు బాధితుడు తెలిపారు.
ఈ ఘటనలో అంబర్ ప్యాకెట్లు, బీడీలు, సిగరెట్లు, చాక్లెట్లు, నగదుతో కలిపి సుమారు 40 వేల రూపాయల విలువైన సామగ్రి అపహరణకు గురైంది.
వికలాంగుడైన శ్రీనివాస్ చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జీవనాధారమైన షాపులో చోరీ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దొంగిలించిన సామగ్రిలో కొంత భాగాన్ని స్థానిక పోచమ్మ గుడి సమీపంలో పడేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇది ఆకతాయిల పనే అయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.




