Manthani: మంథనిలో పూలే విగ్రహం అపరిశుభ్రతపై బీఆర్ఎస్ నాయకుల ధర్నా!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం అపరిశుభ్రతపై బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు.

SHANKAR, MANTHANI
Published on: 28 Nov 2026 4:54 PM IST
Manthani
X

Manthani: మంథనిలో పూలే విగ్రహం అపరిశుభ్రతపై బీఆర్ఎస్ నాయకుల ధర్నా!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత పూలే విగ్రహం అపరిశుభ్రంగా, దుమ్ము ధూళితో ఉండటాన్ని గమనించిన బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహనీయుల విగ్రహాల పట్ల మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మంథని పట్టణంలోని మహనీయుల విగ్రహాలను మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి స్వర్గీయ శ్రీపాదరావు విగ్రహం మినహా ఇతర మహనీయుల విగ్రహాలను శుభ్రం చేయడం లేదని, కనీస నిర్వహణ కూడా చేపట్టడం లేదని మండిపడ్డారు. సమాజానికి మార్గదర్శకులైన మహనీయుల విగ్రహాల పట్ల వివక్ష చూపడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా స్థలానికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడారు. అనంతరం పోలీసుల చొరవతో మున్సిపల్ సిబ్బంది పూలే విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాను విరమించి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్య, సామాజిక సమానత్వం, న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

సమాజంలో విద్య, సమానత్వం, సామాజిక న్యాయం పరిఢవిల్లాలంటే ప్రతి ఒక్కరూ పూలే చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వేగోలపు శంకర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్య, మున్సిపల్ కౌన్సిలర్ మాచిడి రాజు గౌడ్, సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షులు కనవేన శ్రీనివాస్ తోపాటు తదితరులు ఉన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI