Sircilla: సిరిసిల్ల సభలో అభివృద్ధి మాట లేదు.. కేవలం వ్యక్తిగత విమర్శలే: బీఆర్ఎస్
Sircilla: సిరిసిల్ల సభలో అభివృద్ధి శూన్యం, వ్యక్తిగత దూషణలే లక్ష్యం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు గంగుల, వినోద్ కుమార్, కౌశిక్ రెడ్డి తీవ్ర ధ్వజం చేనేత పథకాలపై నిలదీత.
Sircilla: సిరిసిల్ల సభలో అభివృద్ధి మాట లేదు.. కేవలం వ్యక్తిగత విమర్శలే: బీఆర్ఎస్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సభలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై చేసిన విమర్శలు, ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. సభలో రైతులు, చేనేత కార్మికులు, సాగునీరు, ఉపాధి, అభివృద్ధి అంశాలపై సమాధానాలు ఇవ్వకుండా వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు.
మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరీంనగర్‌కు వస్తున్నారంటే అభివృద్ధిపై కొత్త ప్రకటనలు చేస్తారని ప్రజలు ఆశించారని, అయితే ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు తప్ప కొత్తగా చెప్పడానికి ఏమీ లేకపోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్‌కు అనేక నిధులు, అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, కేబుల్ బ్రిడ్జి, రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టులు అప్పటి ప్రభుత్వంలోనే వచ్చాయని తెలిపారు.
నిన్న సీఎం ప్రారంభించిన కరీంనగర్ కలెక్టరేట్‌కు కూడా కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయించిందని, తానే భూమిపూజ చేశానని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో కరీంనగర్‌కు కొత్తగా ఇచ్చిన పెద్ద ప్రాజెక్టు ఏమిటో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జి పనులపై కూడా సమాధానం చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి స్థాయికి తగని భాషలో వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు.
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. సిరిసిల్ల సభకు పలు జిల్లాల నుంచి ప్రజలను తరలించారని, రైతులు, సాగునీరు, చేనేత కార్మికుల సమస్యలు, ఉపాధి అంశాలపై సీఎం మాట్లాడతారని ప్రజలు ఆశించారని అన్నారు. అయితే సభను కేసీఆర్, కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకే పరిమితం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, కేటీఆర్ సిరిసిల్లను అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దారని తెలిపారు.
విద్యాసంస్థలు, మౌలిక వసతులు, చేనేత రంగానికి సంబంధించిన కార్యక్రమాలతో సిరిసిల్లకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. సిరిసిల్ల అభివృద్ధిని చూసి రాష్ట్రాన్ని కూడా అదే తరహాలో అభివృద్ధి చేయాలని సూచించారు. నేత కార్మికుల కోసం తీసుకొచ్చిన వర్కర్ టు ఓనర్ పథకం ఎందుకు నిలిచిపోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చేపట్టిన ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 8 వేల ఎకరాల భూముల వ్యవహారంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరామని తెలిపారు. సీఎం చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ ఫ్లైఓవర్ వరకు అనుమతులు, ప్రతిపాదనలు, లేఖల ప్రక్రియ గతంలోనే జరిగిందని, తాను ఎంపీగా ఉన్న సమయంలో ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పే ముందు అప్పటి అభివృద్ధి, మంజూరైన ప్రాజెక్టుల వివరాలను పరిశీలించాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. నిన్నటి సిరిసిల్ల సభలో అభివృద్ధి కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. సిరిసిల్ల ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారని, వ్యక్తిగత దూషణల రాజకీయాలను కోరుకోవడం లేదన్నారు. సిరిసిల్ల అంటే కేటీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం, విద్య, మౌలిక వసతులతో గుర్తింపు పొందిన ప్రాంతమని తెలిపారు. సిరిసిల్లను రాజకీయ కక్షలకు వేదికగా కాకుండా అభివృద్ధికి నమూనాగా చూడాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని, వేములవాడ, సిరిసిల్ల అభివృద్ధికి గత ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలు మరచిపోలేదన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన భవనాలకు రిబ్బన్లు కట్ చేయడం కంటే కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలకు రిబ్బన్లు కట్ చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి చివరకు కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కరీంనగర్ కలెక్టరేట్‌ను ప్రారంభిస్తున్నారని అన్నారు. కలెక్టరేట్ నిర్మాణంలో రేవంత్‌రెడ్డి పాత్ర ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కేటీఆర్ సిరిసిల్లలో చేసిన అభివృద్ధిలో కనీసం 10 శాతం అభివృద్ధినైనా తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో చేసి చూపించాలని సవాల్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గానికి రెండో విడత దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సిరిసిల్లలో చేనేత రంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని పునరుద్ధరించాలని, కరీంనగర్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని కోరారు. కరీంనగర్‌కు కొత్త అభివృద్ధి ప్రాజెక్టులు ప్రకటించాలని, హుజురాబాద్‌కు రెండో విడత దళితబంధు నిధులు విడుదల చేసి నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చేనేత రంగం పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, గత ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలను బయటపెట్టి ప్రజలకు వాస్తవాలు వివరించాలని కోరారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, పుట్టా మధు, మాజీ ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందాం కళా చక్రపాణి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, ద్యావ వసంత, మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్‌తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




