Karimnagar: గంగులపై అనుచిత ఫ్లెక్సీలు: పోలీసులకు ఫిర్యాదు!

Karimnagar: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కించపరిచేలా కిషన్‌నగర్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 8 Oct 2026 8:12 PM IST
Karimnagar
X

Karimnagar: గంగులపై అనుచిత ఫ్లెక్సీలు: పోలీసులకు ఫిర్యాదు!

కరీంనగర్‌: కరీంనగర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను కించపరిచేలా కిషన్‌నగర్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్‌ నగర శాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కరీంనగర్‌లోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కిషన్‌నగర్‌లో గంగుల కమలాకర్‌ను కించపరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కొద్దిసేపు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

అనంతరం చల్లా హరిశంకర్‌ ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మూడో పట్టణ సీఐని కలిసి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరీంనగర్‌ నగరంలోని 28, 29, 30 డివిజన్లకు చెందిన యువత పెద్ద సంఖ్యలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరడాన్ని కొందరు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కిషన్‌నగర్‌కు చెందిన యువత గంగుల కమలాకర్‌ నాయకత్వంపై నమ్మకంతో స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్‌లో చేరారని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులను ఆహ్వానించారని, సుమారు 150 మంది యువత బీఆర్ఎస్‌లో చేరినట్లు పేర్కొన్నారు.

నగరంలో బీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి కొందరు రాజకీయంగా తట్టుకోలేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన రాజకీయ పార్టీలో చేరే స్వేచ్ఛ ఉందని అన్నారు. పార్టీ మారిన వారిని బెదిరించడం, కేసుల్లో ఇరికిస్తామని హెచ్చరించడం, ఇబ్బందులకు గురిచేస్తామని చెప్పడం సరికాదన్నారు.

బీఆర్ఎస్‌లో చేరిన కుటుంబాలను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలను తక్షణమే అడ్డుకోవాలని కోరారు. కరీంనగర్‌ నగరంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కించపరిచే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌ సీపీ, ఏసీపీ, సీఐలను బీఆర్ఎస్‌ నాయకులు కోరారు. అలాగే నగరంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నాయకులపై అధిష్ఠానం కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ తో పాటు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ మాజీ కార్పొరేటర్లు గందె మహేష్, ఐలేందర్ యాదవ్, ఎడ్ల అశోక్, పలువురు బారస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN