Sircilla: దీక్షా దివాస్ స్ఫూర్తి సభకు ఆహ్వానిస్తూ సిరిసిల్లలో బీఆర్ఎస్ ప్రచారం!
Sircilla: ఈ నెల 29న కరీంనగర్ అలుగునూర్‌లో జరిగే దీక్షా దివాస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని కోరుతూ సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Sircilla: దీక్షా దివాస్ స్ఫూర్తి సభకు ఆహ్వానిస్తూ సిరిసిల్లలో బీఆర్ఎస్ ప్రచారం!
సిరిసిల్ల: ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో నిర్వహించనున్న చలో కరీంనగర్ – దీక్షా దివాస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని కోరుతూ సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో మహిళలకు బొట్టు పెడుతూ సభకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రాత్మక ఘట్టం దీక్షా దివాస్ అని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిందని గుర్తుచేశారు.
నాటి తెలంగాణ ఉద్యమ చరిత్రను, సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజును ప్రతి సంవత్సరం దీక్షా దివాస్‌గా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
ఈ నెల 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా అలుగునూర్‌లో నిర్వహించనున్న దీక్షా దివాస్ స్ఫూర్తి సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలను కలవగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాటి రోజులను గుర్తుచేసుకుంటూ సభకు తప్పకుండా హాజరవుతామని పలువురు హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు. కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ప్రత్యక్షంగా చూడటం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వేముల రాములు, బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ, చేరాల స్వాతి, పద్మ, నీలిమ, సయ్యద్ షాదబ్‌తో పాటు మహిళలు, బీడీ కార్మికులు పాల్గొన్నారు.




