Karimnagar: బెజ్జంకిలో దీక్షా దివస్ సన్నాహక సమావేశం.. పాల్గొన్న వినోద్ కుమార్!
Karimnagar: నవంబర్ 29న కరీంనగర్ అలుగనూరులో జరిగే దీక్షా దివస్ సభపై బెజ్జంకిలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, రసమయి బాలకిషన్ సన్నాహక సమావేశం నిర్వహించి ఉద్యమ చరిత్రను గుర్తుచేశారు.
Karimnagar: బెజ్జంకిలో దీక్షా దివస్ సన్నాహక సమావేశం.. పాల్గొన్న వినోద్ కుమార్!
Karimnagar: బెజ్జంకి మండల పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టమైన నవంబర్ 29 దీక్షా దివస్‌ను ఈ సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు.
నవంబర్ 29న కరీంనగర్ జిల్లా అలుగనూరులో సాయంత్రం 4 గంటలకు దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో బెజ్జంకి మండల పార్టీ కార్యాలయ కేంద్రంలో సన్నాహక సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు హాజరై కార్యక్రమ నిర్వహణ, ప్రజల సమీకరణ, రవాణా, సభా ప్రాంగణ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు దారితీసిన పరిస్థితులు
2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, 2009 ఎన్నికల తర్వాత కూడా రాష్ట్ర ఏర్పాటు విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాలయాపన చేయడం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక వెనక్కి తగ్గేది లేదని నిర్ణయించుకున్న కేసీఆర్, అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సాధారణ రాజకీయ నిరసన కాదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన నిర్ణయాత్మక పోరాటమని సమావేశంలో గుర్తుచేశారు. ‘తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఆయన తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమానికి నాయకత్వం వహించారు.
కేసీఆర్ దీక్షకు దిగవద్దని, సుదీర్ఘ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించవచ్చని ఆనాటి ఉద్యమ నాయకులు ఆయనతో చర్చించినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరి, ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆందోళన నేపథ్యంలో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారని వివరించారు.
కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్‌ను అలుగనూరు వద్ద అరెస్టు చేయడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిందని, అదే అలుగనూరు ప్రాంతంలో ఇప్పుడు దీక్షా దివస్ నిర్వహించడం చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశమని సమావేశం అభిప్రాయపడింది.
కేసీఆర్ అరెస్టు అనంతరం ఖమ్మం జైలుకు తరలించడం, అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో నిమ్స్‌కు తరలించడం, ఆయన నిరాహార దీక్ష కొనసాగించడం వంటి పరిణామాలు తెలంగాణ అంతటా ఉద్యమాన్ని ఉధృతం చేశాయి.
కేసీఆర్ అరెస్టు జరిగిన రోజే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకోవడం ఉద్యమాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆందోళనలు చేపట్టారు. కాకతీయ విశ్వవిద్యాలయం సహా తెలంగాణలోని విద్యాసంస్థల్లో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. తెలంగాణ అంతటా ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
తెలంగాణ ప్రజల ఉద్యమ తీవ్రత, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి, రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
డిసెంబర్ 23 ప్రకటన అనంతరం తెలంగాణ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ రాజకీయ, ప్రజా, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు కలిసి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు పూనుకున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
రైల్ రోకోలు, వంటావార్పులు, మిలియన్ మార్చ్, సాగరహారం వంటి అనేక ప్రజా ఉద్యమ కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నాలుగేళ్ల పాటు నిరంతర పోరాటంగా సాగింది. తెలంగాణ ప్రజల ఐక్య పోరాటం, ఉద్యమకారుల త్యాగాలు, కేసీఆర్ నాయకత్వంలో సాగిన రాజకీయ ఉద్యమం చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేశాయని సమావేశంలో గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక కొత్త తరం ముందుకు వచ్చిందని, 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్ష ప్రారంభించిన సమయంలో జన్మించిన పిల్లలు కూడా ఇప్పుడు ఓటు హక్కు పొందే వయస్సుకు చేరుకుంటున్నారని సమావేశంలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది? ఆ రాష్ట్ర సాధన కోసం ఎలాంటి పోరాటాలు జరిగాయి? కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేపట్టారు? వేలాది మంది యువకులు, విద్యార్థులు ఎందుకు బలిదానాలు చేశారు? వంటి అంశాలను నేటి యువతకు వివరించాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యమకారులపై ఉందని అన్నారు.
దీక్షా దివస్‌ను కేవలం ఒక వార్షిక కార్యక్రమంగా కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రను పునఃస్మరించుకునే, ఉద్యమ స్ఫూర్తిని నూతన తరానికి అందించే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటే కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించారు.
మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కేసీఆర్‌ను అరెస్టు చేసిన అలుగనూరు ప్రాంతంలోనే దీక్షా దివస్ నిర్వహించాలని నిర్ణయించడం చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. అలుగనూరు–గుండ్లూరు మధ్య విశాలమైన సభా ప్రాంగణాన్ని ఎంపిక చేసి, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి వి రామకృష్ణారావు, మండల్ అధ్యక్షుల మహిపాల్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణ్, తిరుపతి, శ్రీనివాస్ గుప్తా, బోయిన్పల్లి శ్రీనివాసరావు,సర్పంచులు పెద్దన్న, భీమయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్ ఎల శేఖర్ బాబు, రాజు, దేవయ్య , మహేందర్ రెడ్డి, దీటి బాల నర్స్, మహేష్ శంకర్, శివకృష్ణ, సుదర్శన్, భూమయ్య, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్, తిరుపతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




