Sircilla: కబ్జా భూములను పేదలకు పంచాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి!
Sircilla: సిరిసిల్లలో కబ్జాకు గురైన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని బీజేపీ డిమాండ్. వివరాలు బహిర్గతం చేయాలన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డవేని గోపి.
Sircilla: కబ్జా భూములను పేదలకు పంచాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి!
సిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో కబ్జాకు గురైన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు రెడ్డవేని గోపి డిమాండ్ చేశారు. సిరిసిల్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక శాసనసభ్యుడు, ఆయన అనుచరులు దళితులు, బలహీన వర్గాలకు చెందిన సుమారు 8 వేల ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో వెల్లడించిన విషయాన్ని గోపి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వెల్లడించినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఇప్పటికే అధికారులు 2,400 ఎకరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారని, ఆ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
అసైన్డ్ కమిటీ ఛైర్మన్‌గా స్థానిక ఎమ్మెల్యే ఉంటారని, ఆయనకు తెలియకుండా భూ పంపిణీలు ఎలా జరిగాయో, ఇందులో అధికారుల పాత్ర ఎంత ఉందో తేల్చాలని గోపి అన్నారు. అక్రమాలకు కారణమైన ప్రజాప్రతినిధితో పాటు బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కబ్జాకు గురైన 8 వేల ఎకరాల భూములను రికవరీ చేసి నిరుపేదలకు అందించాలని, లేనిపక్షంలో భాజపా ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




