Karimnagar: కరీంనగర్ జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి!
Karimnagar: కరీంనగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని బీజేపీ డిమాండ్. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన గంగాడి కృష్ణారెడ్డి, ఇతర నేతలు.
Karimnagar: కరీంనగర్ జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి!
Karimnagar: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు ప్రభావిత మండలాల జాబితాలో కరీంనగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ,జిల్లాలోని అనేక మండలాల్లో కరువు పరిస్థితులు తాండవిస్తున్నప్పటికీ, వాటిని విస్మరించి కేవలం 3 మండలాలను మాత్రమే జాబితాలో చేర్చకపోవడం పట్ల బిజెపి శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు కరీంనగర్ జిల్లా లోని అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చాలని , మొత్తం కరీంనగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బిజెపి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, బాస సత్యనారాయణ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ , శ్రీనివాస్ రావు , కనుమల్ల గణపతి ,డిప్యూటీ మేయర్, రాష్ట్ర అధికార ప్రతినిధి వై సునీల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డిలు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
సకాలంలో వర్షాలు కురవకపోవడం, కరెంట్ సరిగ్గా అందకపోవడం వల్ల జిల్లాలో పంట దిగుబడి పూర్తిగా దెబ్బతిన్నదని, భూగర్భ జలాలు ఎండిపోయాయని తెలిపారు. సాగు, తాగు నీటికి తీవ్ర కొరత ఏర్పడటంతో రైతులు, సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం సాధారణ వర్షపాతం గణాంకాల ఆధారంగా కాకుండా, మండలాల వారీగా నమోదైన వర్షపాతం, నేలలో తేమ, పంటల నష్టం, సాగునీటి లభ్యత, భూగర్భ జలాల స్థాయి, ఉపగ్రహ చిత్రాలు, వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి నివేదికలు రైతుల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని కరువు ప్రభావిత ప్రాంతాలను శాస్త్రీయంగా అంచనా వేయాలని డిమాండ్ చేశారు.
అర్హత ఉన్న ప్రతి మండలాన్ని కరువు ప్రభావిత జాబితాలో చేర్చాలని, కరువు ప్రభావిత రైతులకు వర్తించే ఇన్పుట్ సబ్సిడీ, పంట రుణాల పునర్వ్యవస్థీకరణ, సాగునీరు, తాగునీరు, పశుగ్రాసం వంటి సహాయక చర్యల అమలుపై యుద్ధ ప్రాతిపదికన సమీక్ష నిర్వహించాలని కోరారు.
రైతు సంక్షేమం, వ్యవసాయ పరిరక్షణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ జిల్లా రైతులకు సంపూర్ణ న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను కోరారు.




