Sircilla: భారత వ్యతిరేక శక్తులతో భారత్ సమ్మిట్ దారుణం..రెడ్డబోయిన గోపి!
Sircilla: భారత వ్యతిరేక శక్తులతో భారత్ సమ్మిట్ నిర్వహించడం దారుణమని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు.
Sircilla: భారత వ్యతిరేక శక్తులతో భారత్ సమ్మిట్ దారుణం..రెడ్డబోయిన గోపి!
Sircilla: తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌కు భారతదేశాన్ని వ్యతిరేకించే శక్తులను ఆహ్వానించడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తోందని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ శ్రేణులు నల్ల జెండాలతో ఆందోళన చేపట్టి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశాయి.
ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడం, అభివృద్ధి సాధించడం లక్ష్యంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెబుతున్నారని, గతంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి, ఎంతమందికి ఉపాధి లభించిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
భారతదేశాన్ని వ్యతిరేకించే, దేశ సమగ్రతను ప్రశ్నించే శక్తులకు భారత్ సమ్మిట్‌లో ఆహ్వానాలు పలకడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేయడం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు తెలపడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసే వ్యక్తులకు అంతర్జాతీయ వేదిక కల్పించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడుల రాకకు, పరిశ్రమల ఏర్పాటుకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి సమ్మిట్లు నిర్వహిస్తే స్వాగతిస్తామని, అభివృద్ధి పేరుతో భారతదేశ గౌరవాన్ని కించపరిచే శక్తులకు ప్రాధాన్యత కల్పించడాన్ని మాత్రం సహించబోమని హెచ్చరించారు.
తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ గౌరవం, ప్రతిష్ఠకు భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి సంటి మహేష్, పార్లమెంట్ కో-కన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పట్టణ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




