Sircilla: సిరిసిల్లలో బీజేపీ ధార్మిక సెల్ నూతన కార్యవర్గ నియామకాలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి కార్యాలయంలో ధార్మిక సెల్ నూతన కార్యవర్గ సమావేశం. 13 మండలాలు, 2 మున్సిపాలిటీలకు అధ్యక్షులు, కో-కన్వీనర్ల నియామకం.

KALEEM, SIRICILLA
Published on: 12 Oct 2026 4:52 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో బీజేపీ ధార్మిక సెల్ నూతన కార్యవర్గ నియామకాలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం బీజేపీ జిల్లా ఎండోమెంట్స్ సెల్ (ధార్మిక సెల్) నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్ సూర్య ప్రకాష్, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్ సూర్య ప్రకాష్ తొలిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి స్వాగతించి సన్మానించారు. అనంతరం నాయకులు పరస్పరం సన్మానించుకున్నారు.

జిల్లాలో ధార్మిక సెల్‌ను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 13 మండలాలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో మండల అధ్యక్షులు, కో-కన్వీనర్లను నియమించారు. నూతనంగా నియమితులైన వారికి నాయకులు నియామక పత్రాలను అందజేశారు. ఆలయాల పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం, హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ధార్మిక కార్యక్రమాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందంజ

బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా చురుకుగా పాల్గొంటోందని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా వేములవాడ అర్బన్ మండలంలో అత్యధిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించినందుకు బీజేపీ వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్‌తో పాటు ధార్మిక సెల్ అర్బన్ మండల అధ్యక్షుడు, ఇద్దరు కో-కన్వీనర్లను సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు చేపట్టిన మండల అధ్యక్షులు, కో-కన్వీనర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో హిందుత్వ భావజాలాన్ని, భక్తిభావాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆలయాల ప్రాశస్త్యం, సనాతన ధర్మ విశిష్టతను ప్రజలకు తెలియజేయడంతో పాటు పురాతన దేవాలయాలు, వాటికి సంబంధించిన ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ధార్మిక సంప్రదాయాలను భావితరాలకు అందించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, ఈ కార్యక్రమాలకు బీజేపీ జిల్లా నాయకత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ, రాష్ట్ర ధార్మిక సెల్ చేపడుతున్న కార్యక్రమాలను జిల్లాలోని అన్ని మండలాల్లో విస్తృతంగా నిర్వహిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉండటం అభినందనీయమన్నారు. ఇందుకు సహకరిస్తున్న జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిని అభినందించారు. రాష్ట్ర పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను గతంలో మాదిరిగానే రానున్న రోజుల్లోనూ మరింత విస్తృతంగా నిర్వహించాలని నూతన కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర జాయింట్ కో-కన్వీనర్లు నవీన్ కుమార్, భోగ రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ధార్మిక సెల్ కో-కన్వీనర్లు బొమ్మాడి స్వామి, గొట్టే రామచంద్రం, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ సాబీర్, జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటి రాజు రావు, గంభీరావుపేట మండల అధ్యక్షుడు కోడే రమేష్‌తో పాటు నూతనంగా నియమితులైన ధార్మిక సెల్ మండల అధ్యక్షులు, కో-కన్వీనర్లు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA