Karimnagar: అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
Karimnagar: కరీంనగర్ అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీక అని డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు.
Karimnagar: అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
కరీంనగర్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు.
స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్ మైదానంలో అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ & కాలేజెస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బతుకమ్మ ఉత్సవాలకు వారి సతీమణి డా.వి.వనజా నరేందర్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు మైదానంలో జ్యోతి ప్రజ్వలన చేసి, దుర్గామాత కు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అల్ఫోర్స్ విద్యాసంస్థల వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను ఎంతో వైభవంగా & ఉత్సాహంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా బతుకమ్మ వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించడం జరిగిందని వారు చెప్పారు. తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ మన సంస్కృతీ వైభవానికి ప్రతిబింబమని, తరతరాలుగా వస్తున్న ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని కాపాడుకుంటూ భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు.
ఉత్సవాలలో భాగంగా విద్యార్థినిలు అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకువచ్చి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జానపద గేయాల మీద చేసిన నృత్య ప్రదర్శనలు ఆలోచింపచేసాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




