Karimnagar: నవంబర్ 5న కరీంనగర్లో బండి సంజయ్ ‘మహా పాదయాత్ర’
Karimnagar: నవంబర్ 5న కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపడుతున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు.
Karimnagar: నవంబర్ 5న కరీంనగర్లో బండి సంజయ్ ‘మహా పాదయాత్ర’
కరీంనగర్: కరీంనగర్ నగరంలో నవంబర్ 5వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా పాదయాత్రను విజయవంతం చేసి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు గట్టిగా బుద్ధి చెప్పాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు. మహా పాదయాత్ర కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తెలియజేశారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ఎన్నికల విధానాలపై మరియు ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి నవంబర్ 5వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్ నగరంలోని కార్ఖాన గడ్డ గాంధీ చౌరస్తా నుండి టవర్ మీదుగా కమాన్ వరకు మహా పాదయాత్ర ఘనంగా జరగనుంది.
ఈ మహా పాదయాత్రకు సంబంధించి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నిర్మల ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్ప రెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం లతో ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... నవంబర్ 5వ తేదీన కరీంనగర్ గడ్డపై జరగబోయే మహా పాదయాత్ర అత్యద్భుతంగా, అఖండ విజయం సాధిస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. పార్టీ పట్ల ఉన్న అభిమానం, బండి సంజయ్ నాయకత్వ బలం, మరియు జిల్లా శ్రేణుల సమష్టి కృషితో కరీంనగర్ జిల్లాలో ఏ కార్యక్రమం తలపెట్టిన అద్భుత విజయాలు సాధిస్తున్నామని తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోతూ ప్రజల మద్దతు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎస్ఐఆర్ పేరుతో కృత్రిమ ఆందోళనలు సృష్టిస్తోందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.
కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించిన, కాంగ్రెస్ మాత్రం ప్రజలను మోసం చేసేందుకే నిరంతరం ప్రయత్నిస్తోందని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. గత పన్నెండున్నర సంవత్సరాల కాలంలో ఎక్కడా చిన్న ఆరోపణ కూడా లేకుండా అత్యంత పారదర్శకమైన, గొప్ప ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ అందిస్తున్నారని... ప్రపంచ దేశాలు సైతం మోడీ నాయత్వాన్ని ప్రశంసిస్తున్నారని తెలిపారు.
ఈ మహా పాదయాత్ర కార్ఖాన గడ్డ గాంధీ చౌరస్తా నుంచి టవర్ మీదుగా కమాన్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర సాగనున్నందున, ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహిళా మోర్చా నాయకులు, కార్పొరేటర్లు అందరూ తమ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలను సమీకరించి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కరీంనగర్ మహా పాదయాత్రను విజయవంతం చేసి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు గట్టిగా బుద్ధి చెప్పాలని యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల ఆధ్వర్యంలో, అన్నపూర్ణ, మాజీ జెడ్పీ చైర్మన్ కన్నమల్ల విజయ, బిజెపి జిల్లా జనరల్ సెక్రెటరీలు గుజ్జ శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, కనమల్ల గణపతి, మహిళా కార్పొరేటర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




