Karimnagar: చట్టాలపై అవగాహనతోనే సురక్షిత సమాజం: జడ్జి యశ్వంత్ సింగ్!
Karimnagar: కరీంనగర్ ఆర్ట్స్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు. డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్ పిలుపు.
Karimnagar: చట్టాలపై అవగాహనతోనే సురక్షిత సమాజం: జడ్జి యశ్వంత్ సింగ్!
కరీంనగర్: చట్టాలపై అవగాహన లేనికారణంగా చాలా మంది నేరాల బాట పడుతున్నారని, విద్యార్థి దశ నుంచే న్యాయ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే సురక్షిత సమాజం ఏర్పాటవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి యశ్వంత్ సింగ్ అన్నారు.
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్. శివకుమార్ అనుమతితో కరీంనగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ (ఆర్ట్స్) 'న్యాయ విజ్ఞాన సదస్సు' ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడుకుంటూనే, పౌర బాధ్యతలను నెరవేర్చాలని వారు సూచించారు.
న్యాయం కేవలం ధనవంతులకే కాదని పేదలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందిస్తుందని వివరించారు. సదస్సులో పాల్గొన్న ప్యానల్ న్యాయవాదులు పలు అంశాలపై ప్రసంగించారు. మత్తు పదార్థాల సేవనం ఒక సామాజిక రుగ్మత అని న్యాయవాదులు పేర్కొన్నారు.
గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల వల్ల విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని యశ్వంత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సరదా కోసం మొదలయ్యే అలవాటు, చివరకు నేరాలకు దారితీస్తుందని తెలిపారు. ఎన్.డి.పి.ఎస్ చట్టంలోని సెక్షన్ల గురించి వివరిస్తూ, మత్తు పదార్థాల రవాణా చేసినా లేదా వినియోగించినా కష్టమని, కఠిన కారాగార శిక్షలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు అటువంటి అలవాట్లకు దూరంగా ఉంటూ, తమ స్నేహితులను కూడా చైతన్యపరచాలని కోరారు.
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఆన్‌లైన్ నేరాలు పెరిగిపోతున్నాయని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్లు రకరకాల ఆశలు చూపి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని, ఓటిపి (OTP)లు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా విద్యార్థినులు వ్యక్తిగత ఫోటోలను ఇంటర్నెట్‌లో పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఒకరిని కించపరుస్తూ పోస్ట్‌లు పెట్టినా, అసభ్యకర సందేశాలు పంపినా ఐటి చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. సైబర్ వేధింపులకు గురైతే తక్షణమే '1930' నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మానసిక ఒత్తిడిని జయించడానికి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమని అన్నారు. ప్రణాళికాబద్ధమైన చదువు, క్రీడలు, మరియు పెద్దల సలహాలు తీసుకుని అద్భుతమైన విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఉచిత న్యాయసేవల కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ లో సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు ఏ. కిరణ్ కుమార్, పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి ఏ. సత్యనారాయణ, కాలేజీ ఇంచార్జి ప్రిన్సిపాల్ యన్. పద్మ, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మౌనిక, షీ టీమ్ కానిస్టేబుల్ ఆకుల స్వప్న లు పాల్గొన్నారు. సదస్సు తమకు ఎంతో జ్ఞానాన్ని అందించిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానంతరం న్యాయసేవల అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు.




