Karimnagar: నైపుణ్య విద్యకు పెద్దపీట వేయాలి: వి.నరేందర్ రెడ్డి!
Karimnagar: కరీంనగర్‌లో వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభిస్తున్నట్లు విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి వెల్లడించారు.
Karimnagar: నైపుణ్య విద్యకు పెద్దపీట వేయాలి: వి.నరేందర్ రెడ్డి!
కరీంనగర్: మన దేశంలో విద్య కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, డాక్టర్లను తయారు చేసే దిశగానే సాగుతోందని నరేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనివల్ల అందరూ ఆ స్థాయికి చేరలేక నిరుద్యోగ సమస్య పెరుగుతోందని, టెక్నికల్, ఒకేషనల్, స్కిల్ బేస్డ్ కోర్సుల్లో వెనుకబడిపోతున్నామని తెలిపారు. చిన్నపాటి సాంకేతిక పనులకు సైతం ఇతరులపై ఆధారపడే పరిస్థితి నెలకొందన్నారు. ఆస్ట్రేలియాలో మాత్రం బైపీసీ, ఎంపీసీలతో పాటు సీఈసీ, ఎంఈసీ, వెటర్నరీ, ఆర్ట్స్, మ్యూజిక్, స్పోర్ట్స్ తదితర అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని, అక్కడ విద్యార్థుల్లో ఎలాంటి ఒత్తిడి కనిపించదని పేర్కొన్నారు.
పాఠశాల స్థాయిలో ఒకే విద్యా విధానం
అక్కడ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానం అమల్లో ఉందని, మధ్యలో బోర్డు పరీక్షల ఒత్తిడి లేకుండా ఇంటర్నల్ ఎగ్జామ్స్‌కు 50 శాతం మార్కులు కేటాయిస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూనియర్ కళాశాలను పాఠశాల స్థాయిలో విలీనం చేసే అంశంపై స్పష్టతనిచ్చిన నేపథ్యంలో, ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే 8వ తరగతి నుంచే విద్యార్థులకు నచ్చిన సబ్జెక్టులు (బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, అగ్రికల్చర్ సైన్స్, స్పోర్ట్స్) ఎంచుకునే స్వేచ్ఛ ఉందని వివరించారు. మైనర్ పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని అక్కడ చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారని చెప్పారు.
అల్ఫోర్స్‌లో ఇంటర్నేషనల్ కరిక్యులం
తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో త్వరలో వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు నరేందర్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఆమోద ప్రక్రియ తుది దశకు చేరిందని, రాబోయే విద్యా సంవత్సరంలో నర్సరీ నుంచి రెండో తరగతి వరకు ఈ కరిక్యులంతో తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి
మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి తేవద్దని, ఐఐటీ, మెడిసిన్‌తో పాటు క్లాట్, సీఏ, అగ్రికల్చర్, స్పోర్ట్స్ తదితర రంగాల వైపు కూడా పిల్లలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ బోర్డులు, లేబరేటరీలను మరింత ఆధునీకరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.




