Sircilla: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి: దాసు సురేష్

Sircilla: బీసీలు, పద్మశాలి-చేనేత వర్గాల తరఫున గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ కోరారు.

KALEEM, SIRICILLA
Published on: 27 Oct 2026 2:14 PM IST
Sircilla
X

Sircilla: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి: దాసు సురేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా: బీసీ సమాజానికి రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిరంతరం ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న తనకు త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానానికి అవకాశం కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ కోరారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తన సామాజిక ఉద్యమ ప్రస్థానం, ప్రజాసేవ, బీసీ హక్కుల సాధన కోసం చేసిన పోరాటాలను వివరించారు.

బీసీ సమాజానికి, ముఖ్యంగా పద్మశాలి–చేనేత వర్గాలకు, అట్టడుగు సామాజిక వర్గాలకు శాసనమండలిలో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు తన అభ్యర్థిత్వాన్ని సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

తన తాత దాసు కుమారస్వామి స్వాతంత్ర్య సమరయోధుడిగా, కవి, రచయిత, సామాజిక కార్యకర్తగా ప్రజాజీవితంలో సేవలందించారని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి ప్రముఖులతో ఆయనకు అనుబంధం ఉండేదని, 1969 తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ప్రజా ఉద్యమాలతో సంబంధం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఆయన నుంచి సంక్రమించిన సామాజిక బాధ్యత, ప్రజాసేవా స్ఫూర్తితో బీసీ హక్కుల సాధనకు తన జీవితాన్ని అంకితం చేసినట్లు తెలిపారు.

బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తున్న తాను BCA, MBA విద్యను పూర్తిచేసి, LLB అభ్యసించానని, అంతర్జాతీయ ఐటీ రంగంలో సుమారు 13 సంవత్సరాల మేనేజ్‌మెంట్ అనుభవం ఉందని వివరించారు. వృత్తిపరంగా మరిన్ని అవకాశాలు ఉన్నప్పటికీ బీసీ సమాజానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధించాలనే సంకల్పంతో ప్రజా జీవితాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.

పద్మశాలి–చేనేత కార్మికుల సంక్షేమం కోసం పోరాటం

పద్మశాలి సామాజిక వర్గం, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి సంక్షోభం, సామాజిక భద్రత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు దాసు సురేష్ తెలిపారు. చేనేత కార్మికులకు బీమా రక్షణ, ఆర్థిక భరోసా కల్పించాలనే డిమాండ్లతో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నానని, రూ.5 లక్షల బీమా పథకం అమలుకు సాగిన పోరాటాల్లో తమ ఉద్యమం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వం బీమా మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచిన పరిణామం చేనేత కార్మికుల సంక్షేమం కోసం సాగించిన పోరాటానికి ప్రాధాన్యతను చాటుతుందని అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ సాధనకు ఏడేళ్ల ఉద్యమం

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు, త్యాగాలకు తగిన గుర్తింపు కల్పించాలనే లక్ష్యంతో ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు కోసం సుమారు ఏడేళ్ల పాటు ఉద్యమించినట్లు తెలిపారు. సహచరులతో కలిసి సాగించిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా 2022లో ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు కావడం బీసీ నాయకుల చరిత్రకు, త్యాగాలకు గౌరవం కల్పించిన ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు.

బీసీ కులగణన, 42 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమం

బీసీల జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో న్యాయమైన వాటా దక్కాలంటే కులగణన, సముచిత ప్రాతినిధ్యం అత్యవసరమని దాసు సురేష్ పేర్కొన్నారు. బీసీ జేఏసీ కో-చైర్మన్‌గా వివిధ ప్రజా ఉద్యమాలు, నిరసనలు, సమావేశాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు, బంద్‌లు, న్యాయపరమైన ప్రయత్నాలు, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో భాగస్వామినయ్యానని చెప్పారు.

బీసీ మహిళలకు ప్రత్యేక ఉపకోటా, చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం, బీసీ సబ్‌ప్లాన్ వంటి అంశాలపై కూడా నిరంతరం పోరాడుతున్నట్లు వివరించారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో దశాబ్దపు అనుభవం

మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎంపీ ఆర్. కృష్ణయ్య నాయకత్వంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో సుమారు దశాబ్దం పాటు పనిచేసినట్లు తెలిపారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల వరకు ఎదిగానని, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాల విస్తరణకు కృషి చేశానని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఆర్టీసీ కార్మికులు, రైతుల సమస్యలపై జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ప్రజా సమస్యలను అర్థం చేసుకొని సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందించిందన్నారు.

బీసీ రాజ్యాధికార సమితి ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బీసీ వర్గాలను సమన్వయం చేస్తూ సమావేశాలు, రౌండ్‌టేబుల్ చర్చలు, ధర్నాలు, నిరసనలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో న్యాయమైన వాటా, కులవృత్తుల బలోపేతం, చేతివృత్తుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యాలని వివరించారు.

సామాజిక న్యాయ సిద్ధాంతాల పట్ల నిబద్ధత

కులగణన, సామాజిక న్యాయం, అణగారిన వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం, సమాన అవకాశాల కల్పన వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటిస్తున్న విధానాల పట్ల తనకు నిబద్ధత ఉందని దాసు సురేష్ తెలిపారు. బీసీ సమాజానికి రాజకీయ అధికారంలో తగిన భాగస్వామ్యం కల్పించడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం లభిస్తే శాసనమండలి వేదికగా బీసీలు, చేనేత కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఇతర అణగారిన వర్గాల సమస్యలను బలంగా వినిపిస్తానని అన్నారు. విద్య, ఉపాధి, ఆర్థిక భద్రత, మహిళా సాధికారత, రాజకీయ ప్రాతినిధ్యం, బీసీ హక్కుల సాధన కోసం బాధ్యతతో పనిచేస్తానని తెలిపారు.

తన గత దశాబ్దపు ప్రజా ఉద్యమ ప్రస్థానం, బీసీ సమాజం కోసం చేసిన కృషి, అనుభవం, అంకితభావాన్ని గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

ఈ మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకులు యెల్లె బాలకృష్ణ, సామల పూర్ణచందర్, బచ్చు ప్రసాద్, సబ్బని వేణు, కోడూరి లక్ష్మణ్, దుబాల కొండయ్య, వాసం శ్రీనివాస్, ఇప్పకాయల దేవయ్య, అలవాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA