Sircilla: విద్యార్థుల సమస్యలు తీర్చాకే సీఎం పర్యటించాలి: ఏఐఎస్ఎఫ్!

Sircilla: సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన వేళ ఏఐఎస్ఎఫ్ డిమాండ్ పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు తీర్చాలని నిలదీత.

KALEEM, SIRICILLA
Published on: 29 Sept 2026 4:19 PM IST
Sircilla
X

Sircilla: విద్యార్థుల సమస్యలు తీర్చాకే సీఎం పర్యటించాలి: ఏఐఎస్ఎఫ్!

సిరిసిల్ల: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనకు రావడం సరికాదని ఏఐఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి విమర్శించింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించిన తర్వాతే సీఎం సిరిసిల్లలో అడుగుపెట్టాలని డిమాండ్ చేసింది.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇప్పటికీ విద్యారంగ సమస్యలపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంక్షేమ హాస్టళ్లలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు గురవుతున్న పరిస్థితి ఉందని, జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడంతో విద్యారంగ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురవుతోందని విమర్శించారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ విద్యారంగానికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదని పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, సౌకర్యాలు మెరుగుపరచకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల వైపు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటన సందర్భంగా విద్యారంగ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయాలని, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలతో పాటు జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమితి డిమాండ్ చేసింది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA