Rudrangi: 107 మందికి కొత్త పెన్షన్ పత్రాలు అందజేసిన ఆది శ్రీనివాస్!
Rudrangi: రుద్రంగి మండలంలో కొత్తగా మంజూరైన 107 మందికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పెన్షన్ పత్రాలను అందజేశారు. మండలంలో మొత్తం 2,275 మందికి పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు.
Rudrangi: 107 మందికి కొత్త పెన్షన్ పత్రాలు అందజేసిన ఆది శ్రీనివాస్!
Rudrangi: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన 107 మందికి పెన్షన్ మంజూరు పత్రాలను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
రుద్రంగి మండలంలో నేటి వరకు మొత్తం 2,275 మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని తెలిపారు. ఇందులో వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు తదితర వర్గాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారని వివరించారు.
తాజాగా 107 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం ద్వారా అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.ఎన్నో ఏళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు నేడు ఆ కల నెరవేరడం భావోద్వేగానికి గురిచేస్తోందన్నారు.
గత మూడు రోజులుగా వేములవాడ, చందుర్తి, మేడిపల్లి ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు లబ్ధిదారుల కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయని చెప్పారు. ముఖ్యంగా అనారోగ్యం, దివ్యాంగత్వం కారణంగా ఇబ్బందులు పడుతూ పెన్షన్ కోసం ఎదురుచూసిన వారికి ఆర్థిక భరోసా కల్పించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ప్రజల కన్నీళ్లు తుడిచి వారి జీవితాల్లో ఆనందం నింపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, పేదలకు వైద్య సహాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.




