Ramagundam: నేర ప్రవృత్తిని వీడకపోతే పీడీ యాక్ట్, నగర బహిష్కరణ: ఏసీపీ రమేష్!

Ramagundam: నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో జీవించకపోతే పీడీ యాక్ట్, నగర బహిష్కరణ తప్పదని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ బుధవారం రౌడీషీటర్లను హెచ్చరించారు.

VIJAY, RAMAGUNDAM
Published on: 25 Nov 2026 5:43 PM IST
Ramagundam
X

Ramagundam: నేర ప్రవృత్తిని వీడకపోతే పీడీ యాక్ట్, నగర బహిష్కరణ: ఏసీపీ రమేష్!

రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. రౌడీషీటర్లు తమ నేర ప్రవృత్తిని పూర్తిగా మార్చుకొని చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

రౌడీషీటర్స్, నేరా చరిత్ర కలిగిన వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని, ఇకపై ఎవరైనా నేరాలకు పాల్పడినా, ప్రజల్లో భయాందోళనలు సృష్టించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదేపదే నేరాలకు పాల్పడుతూ ప్రవర్తన మార్చుకోని వారిపై చట్టపరమైన నిబంధనల మేరకు పీడీ యాక్ట్ అమలు చేయడంతో పాటు నగర బహిష్కరణకు సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు.

నేరాలనే జీవన విధానంగా మార్చుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఇప్పటికైనా నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో గౌరవప్రదంగా జీవించాలనన్నారు. ప్రజల ప్రశాంత జీవనానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ లింగమూర్తి ఎస్సైలు మనోహర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM