Sircilla: జిల్లాలో 8,209 మందికి కొత్త పెన్షన్లు: 19 నుంచి నగదు జమ: ఆది శ్రీనివాస్

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా 8,209 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని, ఈ నెల 19 నుంచి ఖాతాల్లో నగదు జమ అవుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 12 Nov 2026 5:25 PM IST
Sircilla
X

Sircilla: జిల్లాలో 8,209 మందికి కొత్త పెన్షన్లు: 19 నుంచి నగదు జమ: ఆది శ్రీనివాస్

Sircilla: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.

వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వేములవాడ నియోజకవర్గ స్థాయి చేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా 8,209 మందికి పెన్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీ నుంచి నూతన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 1,13,264 మందికి పెన్షన్లు అందుతున్నాయని, కొత్తగా మంజూరైన పెన్షన్లతో కలిపి మొత్తం 1,21,473 మందికి ప్రతి నెలా పెన్షన్లు అందనున్నాయని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం నెలకు సుమారు రూ.25.97 కోట్లు ఖర్చు చేయనుందని పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా బాధితులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితుల నుంచి నూతన పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి అర్హులను ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ నెల 18వ తేదీలోగా మంజూరు పత్రాల పంపిణీ పూర్తి చేస్తామని, 19వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ నగదు జమ అవుతుందని వెల్లడించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు వారి పేరిట ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మహిళా సంఘాలకు పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కుట్టే బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని, త్వరలో అమల్లోకి రానుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు, చెలుకల తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య, ఫ్యాక్స్ చైర్మన్లు వకులాభరణం శ్రీనివాస్, బొమ్మేన భాస్కర్, ఏగోలపు శ్రీనివాస్, గసికంటి ప్రభాకర్, పిల్లి కనకయ్య, ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA